సమస్యలపై నిర్లక్ష్యమేల..?

People Applications in Meekosam Anantapur - Sakshi

‘మీ కోసం’లో ప్రజల     విన్నపాలు

వివిధ సమస్యలపై     345 అర్జీలు

అనంతపురం అర్బన్‌ : సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో అధికారులకు ప్రజలు విన్నవించుకున్నారు. ప్రజల నుంచి డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ శివశంకర్‌రెడ్డి, తహసీల్దారు అనుపమ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 345 అర్జీలు అందాయి.

కొన్ని సమస్యలు ఇలా...
కొత్తచెరువు మండలంలో హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రనాయక్‌పై దాడి చేసిన దామోదరనాయుడు, హరినాథ్‌రెడ్డి, ఉమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.మధు, నాయకులు రామకృష్ణ, పెద్దన, రమణ, మద్దిలేటీ, హుసేన్, వెంకటాద్రి  విన్నవించారు.
గుంతకల్లు మండలం ఎసీఎస్‌ మిల్లు కాలనీకి చెందిన హనుమయ్య కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడాదిన్నర క్రితం రేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ128604000100) తొలగించారని, ప్రజాసాధికార సర్వేలో తాను ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్నట్లు నమోదైందని ఫిర్యాదు చేశాడు.  
తనకు 2013లో ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యిందని, ఆ స్థలాన్ని పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయం వారు స్వాధీనం చేసుకున్నారని ధర్మవరం పట్టణం కొత్తపేటకు చెందిన కె.అమీనా ఫిర్యాదు చేసింది.
ప్రభుత్వం తమకు ఇచ్చిన పట్టాకు వేరొకరు నకిలీ పట్టా సృష్టించారని కళ్యాణదుర్గం పట్టణం దేవీరమ్మకాలనీకి చెందిన ఎల్‌.గోపాల్‌నాయక్‌ విన్నవించారు. తన తల్లి కమలాబాయి పేరున 359 సర్వే నంబరులో పట్టా ఇచ్చారన్నారు. అదే స్థలానికి లక్ష్మక్క అనే మహిళ పేరున నకిలీ పట్టా పుట్టించి స్థలం తమదని చెప్పుకుంటున్నారన్నారు. పట్టా తిరిగి తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరాడు.
యువ నేస్తం కింద నిరుద్యోగ భృతి కోసం ఐదు నెలలుగా దరఖాస్తు చేసుకుంటున్నా మంజూరు కాలేదని హీరేహల్‌కు చెందిన వై.చిదానంద విన్నవించాడు.  
తమ భూమికి వేరొకరి పేరున పట్టా ఇచ్చారని గుమ్మగట్ట మండలం భూప సముద్రానికి చెందిన  జె.ఈశ్వరమ్మ ఫిర్యాదు చేసింది. 1990లో ప్రభుత్వం తమకు సర్వే నంబరు 151–13లో 3.50 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు.  
ఇల్లు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని తాడిపత్రి మండలం వంగనూరు గ్రామానికి చెందిన చిలకలరాణి విన్నవించింది.
తన భర్త బాలనాయక్‌ బీఎస్‌ఎఫ్‌ జవానుగా పనిచేస్తూ కోల్‌కోత్‌లో మరణించాడని బుక్కపట్నం మండలం చిన్నచెరువు గ్రామానికి చెంది వై.జయమ్మ చెప్పింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top