పవన్‌కల్యాణ్ మాతో కలిస్తేనే మేలు | Pawan kalyan should be merged with us | Sakshi
Sakshi News home page

పవన్‌కల్యాణ్ మాతో కలిస్తేనే మేలు

Sep 26 2016 1:57 AM | Updated on Mar 22 2019 5:33 PM

తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు తమ కుమారులను సీఎంలుగా చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని ఉస్మానియా న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గాలి వినోద్‌కుమార్ విమర్శించారు.

- ముఖ్యమంత్రి పదవులు వారసత్వమా?
-  బహుజనుల పొలికేక సభలో వక్తలు
-  మాటతప్పడంలో చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే

 
బి.కొత్తకోట: ముఖ్యమంత్రి పదవులు కుటుంబ వారసత్వమన్నట్టు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు తమ కుమారులను సీఎంలుగా చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని ఉస్మానియా న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గాలి వినోద్‌కుమార్ విమర్శించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆదివారం జరిగిన బహుజనుల పొలికేక చైతన్య సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే సీఎం అయ్యారని అన్నారు. ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఓడిపోతుందని తెలిసే చంద్రబాబు బీసీని సీఎం చేస్తానని చెప్పారని తెలిపారు.
 
  ఇచ్చిన మాట తప్పడంలో ఒకరికొకరు తీసిపోర ని విమర్శించారు. బీజేపీకి బానిస అయిన చంద్రబాబు హోదా కోసం పట్టుబట్టడం లేదన్నారు. 2018లో తాను ఉద్యోగానికి రాజీనామా చేసి తమిళనాడు, తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు ప్రకటించారు. పవన్‌కల్యాణ్ బహుజనులతో కలిస్తేనే మంచి ఫలితాలొస్తాయని పేర్కొన్నారు. భారతీయ అంబేద్కర్‌సేన వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ మాట్లాడుతూ 13 జిల్లాల్లో చంద్రబాబు విమానాశ్రయాలు కడితే దళిత, బహుజనులు విమానాల్లో విహరిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు బహుజనుల భూములను లాక్కొని చైనా, సింగపూర్, జపాన్ దేశాలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలు పంట రుణాలకోసం బ్యాంకులకు వెళ్తే దొంగల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడని చెప్పేవారు. ఇప్పడు ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రమణ్యం, రాయలసీమ కాపు కన్వీనర్ వెంకటాచలపతి, రాష్ట్ర దళిత సమాఖ్య అధ్యక్షుడు శ్రీనివాస్, మైనారిటీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వ్యవస్థాపకుడు ఎస్.కరీముల్లా, రాష్ట్ర గిరిజన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు దివాకర్ తదితరులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement