‘చిరు’నామం.. ఏదీ! | Pavan Ignores The Chiranjeevi | Sakshi
Sakshi News home page

‘చిరు’నామం.. ఏదీ!

Apr 10 2019 10:01 AM | Updated on Jul 6 2019 3:48 PM

Pavan Ignores The Chiranjeevi - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు, నర్సాపురం: మెగాస్టార్‌ చిరంజీవి 2009లో పీఆర్పీ పెట్టి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు, ఆ పార్టీలో కీలకనేతగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ అన్న గొప్పతనంపై ప్రతీ వేదికపైనా గొంతు చించుకున్నారు. తన పునాది అన్నయ్య, తన అభివృద్ధి అన్నయ్య అంటూ లెక్చర్‌లు ఇస్తూనే ప్రచారం సాగించారు. పైగా ఆ ఎన్నికల్లో పీఆర్పీకి మెగా ఫ్యామిలీ మొత్తం స్టార్‌ క్యాంపెయినర్‌లుగా వ్యవహరించారు. సీన్‌ కట్‌చేస్తే 2019 ఎన్నికలు వచ్చే నాటికి పవన్‌ జనసేన పేరుతో సొంత పార్టీతో పోటీలో నిలిచారు. గత 15 రోజులుగా జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పవన్‌ హెలికాప్టర్‌ ద్వారా సుడిగాలి ప్రచారం సాగిస్తున్నారు. అనేక వేదికలపై ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు.

తాను ఓ కానిస్టేబుల్‌ కొడుకునని పదేపదే జనానికి పరిచయం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ పవన్‌ నిర్వహించిన ఎన్నికల సభల్లో ఎక్కడా అన్న చిరంజీవి పేరు మాత్రం నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు.  వేదిక ఎక్కినా కూడా నేను కానిస్టేబుల్‌ కొడుకును, నేను కానిస్టేబుల్‌ కొడుకును ఇదే జపం. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి పవన్‌ ఇదే తంతు. ఇదిలా ఉంటే ఒక్క పవన్‌కల్యాణ్‌ మాత్రమే కాదు, చిరంజీవి మరో సోదరుడు నాగేంద్రబాబు కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అదీ చిరంజీవి సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో నాగేంద్రబాబు పోటీలో ఉన్నారు. చిరంజీవి ఏ వేదిక ఎక్కినా కూడా తన తమ్ముడు నాగేంద్రబాబు తనకు తమ్ముడు మాత్రమే కాదని, వర్ణనకు అందని అనుబంధం తమదని చెపుతుంటారు. మరి అలాంటి తమ్ముడు పోటీలో ఉన్నా చిరు ఏమీ పట్టనట్టు విదేశాలకు వెళ్లిపోయారు. మెగా ఫ్యామిలీ నుంచి కనీసం ఎవరూ ప్రచారానికి రానేలేదు. ఈ ఘటనల నేపథ్యంలో అసలు మెగా ఫ్యామిలీలో లోగుట్టు ఏమిటనే ప్రశ్న జనం మదిని తొలిచేస్తోంది.

చివరిరోజు మెరిసిన బన్ని..
సొంత జిల్లాలో భీమవరం అసెంబ్లీ స్థానానికి పవన్‌ కల్యాణ్‌ పోటీలో నిలిచారు. సొంత పార్లమెంట్‌ నియోజకవర్గం నరసాపురంలో చిరంజీవి తమ్ముడు, పవన్‌ అన్నయ్య నాగేంద్రబాబు పోటీలో నిలిచారు. ఇక మెగా ఫ్యామిలీ మొత్తం డెల్టాలో ప్రచారానికి దిగుతారని అంతా అనుకున్నారు. గతంలో చిరంజీవి పాలకొల్లులో పోటీ చేసినప్పుడు పవన్, బన్ని, అల్లు అరవింద్, చివరకు చిరంజీవి సతీమణి సురేఖ కూడా ప్రచారం చేశారు. ఇక ప్రస్తుత జనసేన నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థి నాగేంద్రబాబు అయితే పాలకొల్లులోనే మకాం వేశారు. కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన ప్రచారానికి దూరంగా ఉన్నారు. చివరిరోజు మంగళవారం ప్రచారంలో అల్లు అర్జున్‌ పాలకొల్లులో మామయ్య పక్కన మెరిశారు.

మళ్లీ వెంటనే నరసాపురంలో జరిగిన సభకు బన్ని డుమ్మా కొట్టారు. అల్లు ఫ్యామిలీకి కూడా నరసాపురంతో అనుబంధం ఉంది. మరి బన్ని సైతం చినమామయ్య గెలుపుకోసం కొద్ది నిమిషాలే కేటాయించడం ఏమిటనేది అర్థంకాని విషయం. ఇక నాగేంద్రబాబు కుమార్తె, కుమారుడు వరుణ్‌తేజ్‌లు కూడా చివరి రోజుల్లో తూతూ మంత్రంగా ప్రచారం చేశారు. అది కూడా వారు తండ్రి నాగేంద్రబాబు కోసం ప్రచారం చేశారే తప్ప.. భీమవరంలో పోటీలో ఉన్న కల్యాణ్‌ బాబాయ్‌ కోసం కష్టపడ్డట్టుగా కనిపించలేదని జనం గుసగుసలాడుతుకుంటున్నారు.

మెగా ఫ్యామిలీ నుంచి కనీసం ఓ ప్రకటన కూడా లేదు
మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె పోటీలో ఉంటే, ఇష్టం లేకపోయినా కూడా  జూనియర్‌ ఎన్టీఆర్, అతని మరో సోదరుడు కల్యాణ్‌రామ్‌లు సోదరి గెలపు కోసం ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. అక్కడ ఆమె ఓ ఎమ్మెల్యేగా మాత్రమే పోటీలో ఉంది. అయితే ఇక్కడ పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రిగా భవిష్యత్‌ తేల్చుకోవడం కోసం ప్రజల ముందుకు వస్తున్నారు. ఇంత ప్రాముఖ్యం ఉన్నా కూడా చిరు ఫ్యామిలీ పెద్దల నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ తరహాలో ప్రకటన కూడా రాకపోవడానికి కారణం ఏమిటో జనానికి అంతు చిక్కడంలేదు. చిరు వారసుడు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్, ఉపాసన, మేనల్లుడైన మరో యువహీరో సాయిధర్మతేజ్‌ లాంటి వాళ్లంతా ఏమైనట్లో అర్థంకాని ప్రశ్న. ఇక ఉండటానికి నామమాత్రంగా కాంగ్రెస్‌లో ఉన్నా క్రియాశీల రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉన్న  చిరంజీవి ఇలాంటి కీలక సమయంలో జపాన్‌ పర్యటనకు వెళ్లిపోవడం కొసమెరుపు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement