కళ్లెదుటే ప్రాణం విడిచాడు!

Patient Died On Road Anantapur - Sakshi

వైద్యం అందక రోగి మృతి

భార్యతో కలిసి అనంతపురానికి బస్సులో పయనం

శ్వాస కష్టమవడంతో  కళ్యాణదుర్గంలోనే దించేసిన కండక్టర్‌

నిమిషాల వ్యవధిలో భార్య ఒడిలోనే ప్రాణాలు విడిచిన భర్త

కిడ్నీ వ్యాధిగ్రస్తుడు సకాలంలో వైద్యం అందక మృతి చెందాడు. శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నఅతడిని చూసి బస్సులోంచి దించేశారు.రోడ్డు పక్కన తన ఒడిలో పెట్టుకుని భార్య సపర్యలు చేస్తుండగానే భర్త ప్రాణం వదిలాడు.గుండెలవిసేలా రోదిస్తున్న భార్యను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.

కళ్యాణదుర్గం: కుందుర్పి మండలం బసాపురం గ్రామానికి చెందిన వడ్డే ఈరన్న (65) మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. వారానికొకసారి అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. సోమవారం ఉదయం భార్య ఈరక్కతో కలిసి ఆస్పత్రికి బయల్దేరాడు. కుందుర్పి నుంచి ప్రైవేట్‌ బస్సులో కళ్యాణదుర్గం వచ్చి.. అక్కడి నుంచి మరో బస్సు ఎక్కారు. అప్పటికే ఈరన్న శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. గమనించిన కండక్టర్‌ తమకెందుకు రిస్క్‌ అనుకున్నాడో ఏమో వారిని టీ సర్కిల్‌లోనే దించేశాడు.

భార్య ఒడిలోనే ప్రాణాలు వదిలిన భర్త
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న భర్తను భార్య తన ఒడిలోకి తీసుకుని సపర్యలు చేసింది. నిమిషాల వ్యవధిలోనే భర్త ఊపిరి ఆగిపోయింది. కళ్లెదుటే భర్త మరణించడం ఆమె తట్టుకోలేకపోయింది. 108 సిబ్బంది వచ్చినా.. అప్పటికే ప్రాణం పోవడంతో వారు వెనుదిరిగారు. భర్త మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని రోదిస్తున్న ఆమెను స్థానికులు, ప్రయాణికులు చూసి ‘అయ్యో పాపం.. ఎంత కష్టం వచ్చిందంటూ’ నిట్టూర్చారు. గంట అవుతున్నా అలాగే రోదిస్తుండటంతో  ఎమ్మార్పీఎస్‌ తాలూకా అధ్యక్షుడు గూబనపల్లి నాగరాజు, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ యూత్‌ నాయకుడు దొడగట్ట సూరి, మరికొంత మంది స్థానికులు చలించిపోయి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. విషయం తెలుసుకున్న కుమారులు భీమేష్, ఓబిలేసులు కళ్యాణదుర్గం చేరుకున్నారు. ప్రైవేట్‌ వాహనంలో ఈరన్న మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతునికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top