‘కనిపెంచే’ దైవాలు

Parents Requests To Help For Disabled Daughters - Sakshi

అవయవాలు చచ్చుబడి మంచంపైన అక్కచెల్లెళ్లు 

బిడ్డల సేవలోనే  బతుకీడుస్తున్న తల్లిదండ్రులు 

ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ఫలితం శూన్యం 

ఆర్థికంగా చితికిపోయిన చిన్న రైతు కుటుంబం 

పెళ్లయ్యాక పిల్లలు కలగాలని ఆలుమగలు కోరుకుంటారు. సంతానం కలిగాక వారి భవిష్యత్‌పై ఎన్నో కలలు కంటారు.  ఆ దంపతులు కూడా గతంలో అలాగే కలలు కన్నారు. కాని వీరి ఊహలకు భిన్నంగా విధి మరో రాత రాసింది. పుట్టిన ఇద్దరు పిల్లలు పాఠశాల విద్య చదువుకుంటున్న సమయంలో అంగవైకల్యంతో కాళ్ళు, చేతులు చచ్చుబడిపోయి నడవలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. ఇది జరిగి 22 సంవత్సరాలయింది. నాటి నుండి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల సేవలోనే బతుకు సాగదీస్తున్నారు. ఈ హృదయ విదారక ఉదంతం ఇరగవరం మండలం అయినపర్రు గ్రామంలోనిది.  

ఇరగవరం: జిల్లాలోని అయినపర్రు గ్రామానికి చెందిన కర్రి వరహాలరెడ్డి, లక్ష్మిప్రభావతిలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నాగలక్ష్మి శారదాదేవి (34), చిన్న కుమార్తె జయసాయిశ్రీ(22). పుట్టినప్పుడు ఇద్దరూ బాగానే ఉన్నారు. పెద్ద కుమార్తె 5వ తరగతి చదువుతుండగా 10 సంవత్సరాల వయసులో స్కూల్‌కు వెళ్తుండగా తరచూ పడిపోతూ ఉండేది. దీంతో తల్లిదండ్రులు తణుకులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అన్ని పరీక్షలు చేసి ఆమెకు జన్యుపరమైన లోపం ఉందని చెప్పారు. ఎంత వైద్యం చేసినా పరిస్థితి మెరుగుకాదని వైద్యులు చెప్పారు. అయినా మెరుగైన వైద్యం కోసమని బిడ్డను రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌ వంటి ఆసుపత్రులకు తీసుకువెళ్లి చూపించారు. అక్కడ కూడా కొన్నిసార్లు మందులు ఇచ్చి పరీక్షలు చేసి బాగవుతుందని చెప్పేవారు. చివరికి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రి వారు పెద్ద కుమార్తె కాళ్ళల్లో నుండి కొద్ది శరీర భాగాన్ని కట్‌చేసి టెస్ట్‌లకు అమెరికా పంపించారు.

ఈ అమ్మాయికి మస్క్యులర్‌ డిస్ట్రోఫీ  (కండరాల బలహీనత) వచ్చిందని, కండరాలు క్రమక్రమంగా చచ్చుబడిపోతాయని, శరీరంలో కొన్ని భాగాలకు రక్త ప్రసరణ కూడా ఆగిపోతుందని రిపోర్టు వచ్చింది. ఈ జబ్బు నయంకాదని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. పెద్ద కుమార్తెకు 12 సంవత్సరాల వయస్సులో వ్యాధి సోకింది. ఇప్పుడు ఆమె వయస్సు 34 సంవత్సరాలు. అప్పటి నుండి ఇప్పటి వరకు శరీరంలోని కాళ్లు, చేతులు చచ్చుబడి బతికిఉన్న జీవశ్ఛవాల్లా ఉన్నారు. 
ఇదిలా ఉంటే పెద్ద కుమార్తె తరువాత 12 సంవత్సరాలకు పుట్టిన చిన్నకుమార్తె జయసాయిశ్రీ పరిస్థితి కూడా అదే. 12 సంవత్సరాల వయస్సులో ఆమెకు కూడా కాళ్ళు, చేతులు చచ్చుబడిపోవడం ప్రారంభమైంది. దీంతో చిన్న కుమార్తెకు కేరళ ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తే ఉపయోగం ఉంటుందని ప్రయత్నం చేశారు. దాని వల్ల కూడా ఎటువంటి ఉపయోగం కలగలేదు. దీంతో కన్నబిడ్డలు కళ్ల ముందు కదలలేని పరిస్థితుల్లో ఉంటే తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నారు. అయినా బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటూ బతుకుతున్నారు.

వరహాలరెడ్డి తనకు ఉన్న 2 ఎకరాల పొలాన్ని బిడ్డల వైద్య ఖర్చుల కోసం అమ్మేశారు. అయినకాడికి బంధువులు దగ్గర అప్పులు కూడా చేశారు. చివరకు మిగిలింది ఒక పెంకుటిల్లు మాత్రమే. అది కూడా అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొదట్లో తల్లి లక్ష్మీప్రభావతే బిడ్డల ఆలనాపాలన చూసుకునేది. అయితే బిడ్డలు ఎదిగేకొద్దీ వారిని కదల్చాలన్నా ఇద్దరి సహాయం తప్పకుండా కావాలి. దీంతో వరహాలరెడ్డి కూడా పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే బిడ్డలను చూసుకుంటున్నారు. వైద్యానికి డబ్బులు లేవు. బతకడానికి పనిచేసుకోలేని పరిస్థితి. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో పిల్లలకు పింఛన్‌ ఇవ్వమని అధికారులు, నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినప్పటికీ వారు కనికరించలేదు. చివరకు సంవత్సరం క్రితం ఒక పాపకు పింఛను రాశారు. వాటితోటే బతుకుతున్నారు. అధికారులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తే బిడ్డలను బతికించుకుంటామని తండ్రి వరహాలరెడ్డి వేడుకుంటున్నారు. దాతలు చైతన్య గోదావరి బ్యాంక్, ఏలేటిపాడు, అకౌంట్‌ నంబర్‌ 720710025000296లో సహాయం జమ చేయాలని ప్రాధేయపడుతున్నారు.

 

ముఖ్యమంత్రి ఆదుకోవాలి 
పెద్దకుమార్తె 22 సంవత్సరాల నుండి, చిన్న కుమార్తె 10 సంవత్సరాల నుండి మసు్క్యలర్‌ డిస్ట్రోఫీ (కండరాల బలహీనత) వ్యాధితో బాధ పడుతున్నారు. పిల్లలిద్దరికీ చాలా చోట్ల పలురకాల వైద్యం చేయించాం. ఎక్కడా ఫలితం కనిపించలేదు. చివరకు ఉన్న ఆస్తి మొత్తం అయిపోయింది. అయినకాడికి అప్పులు చేశాం. ఇక ఉండటానికి ఇల్లు మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ అన్ని విధాలా సహాయం చేస్తున్నారు. మాకు కూడా సహాయం చేస్తే పిల్లలిద్దరికీ తిండిపెట్టుకుని బతికించుకుంటాం.  
– కర్రి వరహాలరెడ్డి, పిల్లల తండ్రి 

మేం బతికి ఉన్నంతకాలం సాకుతాం 
వృద్ధాప్యంలో మమ్మల్ని చూసుకోవలసిన పిల్లల్ని మేమే చూసుకుంటున్నాం. ఉదయం ముఖం కడుక్కునేటప్పటి నుంచి స్నానం చేయించడం, దుస్తులు మార్చడం అన్నీ మంచం మీదే. అన్నీ తల్లిదండ్రులుగా మేమే చేస్తున్నాం. మొదట్లో నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. భర్త పనికి వెళ్లేవారు. పిల్లల వయస్సు పెరగడంతో నా భర్త సహాయం కూడా అవసరమవుతోంది. దీంతో ఇద్దరికీ పనికి పోవడానికి వీలుకావడం లేదు. చిన్నపాపకు వచ్చే పింఛన్‌ డబ్బులతో బతుకుతున్నాం.  మేం చనిపోతే బిడ్డల పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది.  
– కర్రి లక్ష్మీ ప్రభావతి, పిల్లల తల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top