ప్రేమిస్తే విడదీస్తారా..? | Parents Objecting To Love Marriage | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తే విడదీస్తారా..?

Oct 28 2018 10:51 AM | Updated on Oct 28 2018 2:08 PM

 Parents Objecting To Love Marriage - Sakshi

వాళ్లిద్దరూ బీటెక్‌ చదువుతున్నారు. పక్క పక్క వీధుల్లోనే ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అబ్బాయి ఇంట్లో తెలియడంతో పెద్దలు అభ్యంతరం తెలిపారు. ఇంతలో అబ్బాయికి మరొకరితో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమాచారం తెలియడంతో అమ్మాయి సదరు అబ్బాయి ఇంటివద్దకు వెళ్లింది. అప్పటికే తలుపులకు తాళం వేసి ఉండటంతో న్యాయం కోసం ఆందోళన చేపట్టింది. 

అనంతపురం సెంట్రల్‌: తనను ప్రేమించిన యువకుడికి మరొకరితో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసి ఓ యువతి న్యాయం కోసం యువకుడి ఇంటి వద్ద మౌనదీక్ష చేపట్టింది. యువకుడి కుటుంబ సభ్యులు ముందుగానే సమాచారం తెలుసుకుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. వివరాల్లోకెళ్తే.. నగరంలోని సున్నపుగేరిలో నివాసముంటున్న ఓ యువతి, పక్క వీధిలోనే ఉంటున్న శివ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వేర్వేరు కళాశాలల్లో బీటెక్‌ చదువుతున్నారు.

 వీరి ప్రేమ వ్యవహారం తెలిసి అబ్బాయి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. అప్పటి నుంచి వీరిద్దరినీ కలవకుండా కట్టడి చేశారు. అబ్బాయి తండ్రి మునిసిపల్‌ రిటైర్డు ఉద్యోగి. అమ్మాయి కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. దీనికితోడు కులాలు కూడా వేరు కావడంతో ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో శివకు వేరొకరితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుసుకున్న యువతి శనివారం సాయంత్రం యువకుని ఇంటి వద్దకు వచ్చింది. అప్పటికే విషయం తెలుసుకున్న యువకుని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.

 తనకు న్యాయం చేయాలని కోరుతూ వారి ఇంటి వద్దే యువతి గంటపాటు మౌనదీక్ష చేపట్టింది. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు యువతితో చర్చించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీఐ విజయభాస్కర్‌గౌడ్‌ను వివరణ కోరగా ఇరు కుటుంబాల సభ్యులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. అబ్బాయి నిర్ణయం తెలుసుకున్నాక చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement