బడి భారమై.. | parents are making study thier childs staying with relatives | Sakshi
Sakshi News home page

బడి భారమై..

Nov 7 2013 2:47 AM | Updated on Nov 9 2018 4:36 PM

తల్లిదండ్రులు తమ కుమారుడిని బంధువుల ఇంట్లో పెట్టి చదివిస్తున్నారు. వారికి దూరంగా ఉండి చదువుకోవడం ఆ విద్యార్థికి ఇష్టంలేదు. చాలామార్లు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా.

 ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్ :  తల్లిదండ్రులు తమ కుమారుడిని బంధువుల ఇంట్లో పెట్టి చదివిస్తున్నారు. వారికి దూరంగా ఉండి చదువుకోవడం ఆ విద్యార్థికి ఇష్టంలేదు. చాలామార్లు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా.. అక్కడే చదువుకో.. ఏడాది తర్వాత ఇక్కడే బడికి వెళుదువులే అంటూ బుజ్జగిస్తూ వచ్చారు. అయినా ఆ బాలుడు మాత్రం ఇంటి మీదే బెంగతో ఉండేవాడు. ఉన్నట్లుండి బుధవారం బత్తల నవీన్ అనే 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చాడు.
 
 పోలీసుల కథనం ప్రకారం... మైలవరం మండలం కంబాలదిన్నెకు చెందిన నాగరాజుకు నాగప్రసాద్, నవీన్, నరేష్ అనే ముగ్గురు కుమారులున్నారు. మైదుకూరులోని మూలబాటవీధిలో ఉంటున్న నాగరాజు తమ్ముడు నాగేశ్వరరావుకు పిల్లలు లేరు. దీంతో నాగరాజు రెండో కుమారుడైన నవీన్‌ను ఎనిమిదేళ్ల క్రితం అతను మైదుకూరుకు తీసుకొని వెళ్లి చదివిస్తున్నాడు. మిగిలిన ఇద్దరు కుమారులు నాగప్రసాద్ ఇంటర్ చదువుతుండగా, నరేష్ ఏడోతరగతి చదువుతున్నాడు. మైదుకూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బత్తల నవీన్(14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వారం రోజుల క్రితం నవీన్ తన మామ కుమార్తె వివాహం చూడటానికి కంబాలదిన్నెకు వచ్చాడు.
 
 నాలుగు రోజులపాటు బంధువులందరితో సంతోషంగా గడిపాడు. ఏం జరిగిందో ఏమోకానీ బుధవారం ఉదయం ఉన్నట్టుండి నవీన్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ ఎంతసేపైనా బయటికి రాలేదు. గదిలో నుంచి కిరోసిన్ వాసన, పొగ రావడంతో నాగేశ్వరరావుతోపాటు మరికొందరు తలుపులు పగులకొట్టి లోపలికి వెళ్లారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడ్ని వెంటనే ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తండ్రి నాగరాజు, తల్లి సుబ్బలక్షుమ్మతోపాటు సోదరులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు.
 
 చదవడం ఇష్టం లేకే..
 స్వగ్రామానికి దూరంగా ఉంటూ చదువుకోవడం తనకిష్టంలేదని ఆ విద్యార్థి గతంలో చాలాసార్లు తల్లిదండ్రులతో చెప్పారని బంధువులు అంటున్నారు.ఆ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు  వారు చెబుతున్నారు. కాగా కడుపునొప్పి తాళలేక బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం మధ్యాహ్నం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement