బాబు మీడియా సలహాదారుగా పరకాల! | Sakshi
Sakshi News home page

బాబు మీడియా సలహాదారుగా పరకాల!

Published Fri, Jul 4 2014 12:09 AM

బాబు మీడియా సలహాదారుగా పరకాల! - Sakshi

* కేబినెట్ హోదాతో త్వరలో ఉత్తర్వులు
* విస్మయం వ్యక్తం చేస్తున్న టీడీపీ వర్గాలు
* కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త కనుకనే కీలక పదవి ఇచ్చారనే విమర్శలు
 
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి మీడియా సలహాదారుగా విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ పరకాల ప్రభాకర్ నియమితులు కానున్నారు. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. కేబినెట్ హోదా కల్పించి ప్రభాకర్‌ను ఈ పదవిలోకి తీసుకోనున్నారని.. ఒకటి రెండు రోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు విడుదల కావచ్చని చెప్తున్నారు. ప్రభాకర్ బుధవారం సాయంత్రం చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అకస్మాత్తుగా ఇప్పుడు ఆయనను చంద్రబాబు మీడియా సలహాదారుగా తెరమీదకు తేవడం టీడీపీ నేతలను విస్మయానికి గురిచేసింది.

కీలకమైన ఈ బాధ్యతలను ప్రభాకర్‌కు అప్పగించనుండడం పట్ల పార్టీ నేతలు పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మీడియా సలహాదారు అంటే  ప్రభుత్వంలో కీలకమైనదిగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి పదవిని పార్టీలో సీనియర్ నేతలకో, అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉండేవారికో కట్టబెడతారని.. కానీ పార్టీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తికి కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించడమేమిటని టీడీపీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీనే నమ్ముకొని అనేక కష్టనష్టాలకోర్చి చిత్తశుద్ధితో పనిచేసిన నేతలను అధినేత విస్మరించడం ఎంతవరకు సబబంటున్నారు.

చంద్రబాబు పార్టీ నేతల అంచనాలకు భిన్నంగా పరకాల ప్రభాకర్‌కు పదవిలోకి తీసుకోవడం వెనుక కారణాలేమై ఉంటాయన్న దానిపై పలురకాల విశ్లేషణలు సాగుతున్నాయి. కేవలం ఆయన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ భర్తకావడం, కొందరు ప్రముఖుల సూచనలతోనే ఈ నియామకానికి చంద్రబాబు నిర్ణయించి ఉండవచ్చని భావిస్తున్నారు. నిర్మలాసీతారామన్ కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో.. ఈ శాఖకు సంబంధించి రాష్ట్రానికి పలు వ్యవహారాల్లో ఆమె సహకారం అవసరమని అందువల్లే పరకాలకు ఈ పదవిని ఇచ్చి ఉంటారన్న చర్చ పార్టీలో సాగుతోంది.

Advertisement
Advertisement