కరోనా నియంత్రణపై అవగాహనకు కరపత్రాలు, పోస్టర్లు

Pamphlets and posters for understanding of corona control - Sakshi

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు తిరుగుతుండటం, వివిధ రకాల దుకాణాలు తెరుచుకోవడంతోపాటు త్వరలో విమాన సర్వీసులు సైతం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా మారుమూల పల్లెల్లోని వారికి సైతం అవగాహన కలిగించేలా కరపత్రాలు, పోస్టర్లు, సైన్‌ బోర్డులు వంటివి ఏర్పాటు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన రకరకాల కరపత్రాలు, వాల్‌పోస్టర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ప్రత్యేక పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వెంటపెట్టుకోవడం, మాస్కులు విధిగా ధరించడం వంటి పలు సూచనలు, సలహాలను ఈ కరపత్రాల్లో పొందుపరిచారు. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ డా.జవహర్‌రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ఆదేశాల మేరకు వీటిని జిల్లాలకు పంపిణీ చేస్తామని, ఆరోగ్యశాఖ సిబ్బంది ద్వారా వాటిని ఇంటింటికీ చేరవేసి అవగాహన కల్పిస్తామని కుటుంబ సంక్షేమశాఖ అదనపు సంచాలకులు వాసుదేవరావు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top