తిరుమలలో గురువారం అన్యమత గ్రంథాలతో వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సాక్షి,తిరుమల: తిరుమలలో గురువారం అన్యమత గ్రంథాలతో వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్‌ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లికి చెందిన ఏ.శివారెడ్డి (45) తిరుపతిలో తాపీ మేస్త్రీగా పనిచేస్తుంటాడు. గురువారం ఉదయం 10 గంటలకు శ్రీవారి మెట్టు మార్గం నుంచి శ్రీవారి దర్శనానికి దివ్యదర్శనం టోకెన్ వేసుకోకుండానే తిరుమలకు నడిచి వచ్చాడు.
అనుమానంతో సెక్యూరిటీ గార్డు అతన్ని తనిఖీ చేశారు. లగేజీలో అన్యమతానికి చెందిన రెండు గ్రంథాలను గుర్తించి, టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. తిరుమల అశ్వినీ ఆస్పత్రిలో తాపీ పని ఉందని పిలవడంతో నడిచి తిరుమలకు వచ్చానని, తన వద్ద అన్యమత గ్రంథాలు ఉన్న మాట వాస్తవమేనని నిందితుడు శివారెడ్డి అంగీకరించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.