కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం | Outsourcing contract workers dharna in front of collector office | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం

Aug 26 2014 1:03 AM | Updated on Feb 17 2020 5:16 PM

ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని

కర్నూలు(న్యూసిటీ):  ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం కాంట్రాక్ట్ అవుట్ సోర్కింగ్ కార్మికులు స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

కార్మికులను రెగ్యులర్  చేయాలని ప్రజా సంఘాల నాయకులు కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులతో తోపులాట జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో కార్మిక సంఘం నాయకులు ఓబులేసు, పి.ప్రభాకర్, ఎస్.మునెప్ప, అజయ్‌బాబు, భీమలింగప్ప, శ్రీనివాసులు, పి.రామకృష్ణారెడ్డి, నాగరాజు, వెంకటేష్‌లను పోలీసులు అరెస్టు చేసి మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచిపై వారిని విడుదల చేశారు.

 కార్మికులను రెగ్యులర్ చేయాలి..
 కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  జి.ఓబులేసు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.15 వేలు నిర్ణయించకపోతే భవిష్యత్తులో చంద్రబాబునాయుడు మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తుందని హెచ్చరించారు. అసంఘటిత రంగంలో ఉన్న హమాలీ, ఆటో గని, హోటల్, భవన నిర్మాణ కార్మికుల నుంచి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వివరించారు. కానీ ప్రభుత్వం వారికి సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన కార్మికులకు కనీసం రూ.3 వేలు పెన్షన్ ఇవ్వాలని తెలిపారు.

 ఇంటికో ఉద్యోగమేది బాబూ..
 తాను ముఖ్యమంత్రి అయితే ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు తీరా అధికారంలోకి వచ్చాకా ఉన్న ద్యోగులను ఇంటికి పంపిస్తున్నాడని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు ఆరోపించారు. తక్షణమే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.భీమలింగప్ప మాట్లాడుతూ రైతుల రుణ మాఫీ చేయడంలో చంద్రబాబునాయుడు విఫలమైనారని ఆరోపించారు. వ్యవసాయ  కార్మికులకు  అండగా ఉన్న జాతీయ గ్రామీణ  ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని దురాలోచనను మానుకోవాలని సూచించారు.

 కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో..
 శాంతియుతంగా ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేయడం పట్ల కలెక్టరేట్ ఎదుట మహిళలు, కార్మికులు రాస్తారోకో చేశారు. దీంతో పది నిముషాల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.  కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.సుంకన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.శేఖర్, నల్లన్న, రహిమాన్, నరసింహులు, నాగరాజు, పద్మమ్మ, మధు, దేవసహాయం, బాబూలాల్, ఫరూక్, అంగన్‌వాడీ వర్కర్లు, యూనియన్ నాయకురాలు కామేశ్వరి, లలితమ్మ, జులేఖ, గౌసియా, మాజీ కార్పొరేటర్ గిడ్డమ్మ, భాగ్యలక్ష్మి, కోటమ్మ, రఘురామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement