breaking news
Outsourcing contract workers
-
అంతా ‘డౌట్’ సోర్సింగ్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున నకిలీలు వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 4.8లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతుండగా ఇందులో దాదాపు 10 శాతం ఉద్యోగులు నకిలీలే ఉన్నారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపులు, వారికి అందించాల్సిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ తదితర బెనిఫిట్ల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్న తీరుపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది.దీంతో స్పందించిన ప్రభుత్వం ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీల తీగలాగుతోంది. ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆర్థిక శాఖ మరింత లోతుగా విచారణ చేస్తోంది. ఈ ఏజెన్సీలు ఎవరివి? ఎప్పుడు ఇవి ప్రారంభం అయ్యాయి? వీటి వెనకున్న వారెవరు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది. జాడలేని వారెందరో... ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కేవలం కార్యాలయాల్లోనే కాకుండా క్షేత్ర స్థాయిలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే వారి సంఖ్యకు సమానంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీరంతా ఎక్కడెక్కడ ఏయే పోస్టుల్లో ఉన్నారనేది తేల్చేందుకు ఆర్థిఖ శాఖ వ్యూహాత్మక పరిశీలన చేపడుతోంది. ఉద్యోగుల అధార్, పాన్ వివరాలను కూడా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో దాదాపు 5వేల మంది ఉద్యోగులు రెండేసి చోట్ల వేతనాలు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వేతన చెల్లింపులు ప్రభుత్వం నేరుగా చేయకపోవడం, ప్రభుత్వ శాఖలు ఏజెన్సీలకు గంపగుత్తగా నిధులు ఇస్తుండగా... వాటిని వేరువేరు పద్ధతుల్లో చెల్లింపులు చేస్తుండడంతో ఇలాంటి అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. మరోవైపు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వారిలో 24వేల మంది ఉద్యోగుల జాడ లేదు. రికార్డులో ఉన్నప్పటికీ వారు ఎక్కడ పనిచేస్తున్నారో స్పష్టత లేదు. అదేవిధంగా మరికొందరు దీర్ఘకాల గైర్హాజరుతో ఉన్నట్లు గుర్తించారు. వారికి సంబంధించి ప్రభుత్వం వేతన నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని వెనక్కు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇలా పలు రకాలు నకీలు ఉద్యోగులు ఉన్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. ప్రస్తుతం ఏజెన్సీల ఆడిట్ ప్రక్రియ కొనసాగుతోంది. విభిన్న రకాలుగా పూర్తిస్థాయి పరిశీలన చేపడితే పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. బోగస్ ఏజెన్సీలూ ఉన్నాయి... తొలుత నకిలీ ఉద్యోగులు ఉంటారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేయగా... మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఉద్యోగులతో పాటు ఏజెన్సీలు కూడా నకిలీవి ఉన్నట్లు తేలింది. కేవలం ఒక (జ్యోతి కంప్యూటర్ సర్విసెస్) కంపెనీ ఏకంగా ప్రభుత్వానికి 10వేల మంది ఉద్యోగులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో అందించినట్లు రికార్డు ఉంది. ప్రస్తుతం ఆడిట్ ప్రక్రియలో భాగంగా సదరు సంస్థకు నోటీసు ఇచ్చేందుకు అధికారులు ప్రయతి్నంచినా ఫలితం లేదు. ఎందుకంటే అలాంటి సంస్థ జాడ దొరకలేదు. ఇది మాజీ ప్రజాప్రతినిధికి చెందినదిగా సమాచారం. ఇలాంటి ఏజెన్సీలు పదుల సంఖ్యలో ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ దిశలోనూ పరిశీలన చేస్తున్నారు. ఇక నేరుగా చెల్లింపులు... ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపులను క్రమ పద్ధతిలో చేపట్టాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. గంపగుత్తగా నిధులు ఇచ్చే బదులు డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రన్స్ఫర్) పద్ధతిలో చెల్లిస్తే ప్రభుత్వానికి లాభం చేకూరడంతో పాటు ఉద్యోగులకు సకాలంలో చెల్లింపులు జరుగుతాయని, దీంతో అవకతవకలకు తావుఉండదనే అభిప్రాయంతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, కళ్యాణలక్ష్మి సాయం ఇస్తున్న తరహాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా నేరుగా చెల్లింపులు చేసే అంశంపై అధ్యయనం చేస్తున్నారు.ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులే కాకుండా ప్రభుత్వానికి అనుబంధంగా స్వయం ప్రతిపత్తి సంస్థల్లోని ఉద్యోగులకు కూడా ఆర్థిక శాఖ నుంచే నేరుగా చెల్లింపుల చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గంపగుత్త చెల్లింపులు ఉండొద్దని నిర్ణయించిన ఆర్థిక శాఖ...సరళీకరణ పద్ధతిలో చెల్లింపులకు వ్యూహాన్ని తయారు చేస్తోంది ప్రస్తుతం ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఆడిట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెలాఖరు కల్లా ఆడిట్ ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తోంది. అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు అవకాశం ఉంటుంది. -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
కర్నూలు(న్యూసిటీ): ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం కాంట్రాక్ట్ అవుట్ సోర్కింగ్ కార్మికులు స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికులను రెగ్యులర్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులతో తోపులాట జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో కార్మిక సంఘం నాయకులు ఓబులేసు, పి.ప్రభాకర్, ఎస్.మునెప్ప, అజయ్‌బాబు, భీమలింగప్ప, శ్రీనివాసులు, పి.రామకృష్ణారెడ్డి, నాగరాజు, వెంకటేష్‌లను పోలీసులు అరెస్టు చేసి మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచిపై వారిని విడుదల చేశారు. కార్మికులను రెగ్యులర్ చేయాలి.. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.15 వేలు నిర్ణయించకపోతే భవిష్యత్తులో చంద్రబాబునాయుడు మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తుందని హెచ్చరించారు. అసంఘటిత రంగంలో ఉన్న హమాలీ, ఆటో గని, హోటల్, భవన నిర్మాణ కార్మికుల నుంచి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వివరించారు. కానీ ప్రభుత్వం వారికి సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన కార్మికులకు కనీసం రూ.3 వేలు పెన్షన్ ఇవ్వాలని తెలిపారు. ఇంటికో ఉద్యోగమేది బాబూ.. తాను ముఖ్యమంత్రి అయితే ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు తీరా అధికారంలోకి వచ్చాకా ఉన్న ద్యోగులను ఇంటికి పంపిస్తున్నాడని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు ఆరోపించారు. తక్షణమే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.భీమలింగప్ప మాట్లాడుతూ రైతుల రుణ మాఫీ చేయడంలో చంద్రబాబునాయుడు విఫలమైనారని ఆరోపించారు. వ్యవసాయ కార్మికులకు అండగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని దురాలోచనను మానుకోవాలని సూచించారు. కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో.. శాంతియుతంగా ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేయడం పట్ల కలెక్టరేట్ ఎదుట మహిళలు, కార్మికులు రాస్తారోకో చేశారు. దీంతో పది నిముషాల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.సుంకన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.శేఖర్, నల్లన్న, రహిమాన్, నరసింహులు, నాగరాజు, పద్మమ్మ, మధు, దేవసహాయం, బాబూలాల్, ఫరూక్, అంగన్వాడీ వర్కర్లు, యూనియన్ నాయకురాలు కామేశ్వరి, లలితమ్మ, జులేఖ, గౌసియా, మాజీ కార్పొరేటర్ గిడ్డమ్మ, భాగ్యలక్ష్మి, కోటమ్మ, రఘురామమూర్తి తదితరులు పాల్గొన్నారు.


