మరోసారి బాబు మోసం

మరోసారి బాబు మోసం - Sakshi


రాజధాని రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని భావించిన జగన్

3వ తేదీన ఆయా గ్రామాల్లో పర్యటనకు ప్రతిపక్ష నేత నిర్ణయం

జగన్ పర్యటనతో రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రమవుతుందని చంద్రబాబు ఆందోళన

జగన్ కంటే ఒకరోజు ముందు పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు చేసిన ముఖ్యమంత్రి!

జనసేన అధినేతను మరోసారి పావుగా ఉపయోగించుకుంటున్నారనే వ్యాఖ్యలుసాక్షి ప్రతినిధి, గుంటూరు: భూ సమీకరణ పేరిట రాజధాని గ్రామాల రైతుల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తాజాగా మరోసారి వారిని మోసగించి మభ్యపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ గ్రామాల రైతుల నుంచి భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు ఎదురవకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌ను ఉపయోగించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు, ‘రాజధాని సమస్య’ నుంచి బయటపడేందుకు మరోసారి ఆయన్ను పావుగా వాడుకుంటున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.రాజధాని గ్రామాల్లోని రైతులు, కౌలుదారులు, రైతు కూలీల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటిని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు గాను వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 3న ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. జగన్ పర్యటనకు మొదటి నుంచీ భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు, కౌలుదారులు, ప్రజలు  పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. జగన్ పర్యటనతో రాజధాని గ్రామాల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మరింత తీవ్రమవుతుందనే భయంతో.. చంద్రబాబు హడావుడిగా ఆయా గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటనకు రంగం సిద్ధం చేశారు.జగన్ పర్యటనకు ఒకరోజు ముందు ఈ పర్యటన చేపట్టాలని చంద్రబాబు కోరడంతో ఆ మేరకు పవన్ పర్యటన ఖరారైనట్లు సమాచారం. తన మాటల్ని రాజధాని రైతులు, అక్కడి ప్రజలు నమ్మే పరిస్థితులు లేవనే ఉద్దేశంతోనే పవన్‌ను మరోసారి పావుగా ఉపయోగించుకోవడానికి బాబు నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాను చెప్పదలుచుకున్న అంశాలను పవన్ ద్వారా ప్రజలకు చెప్పించాలనే ముఖ్యమంత్రి ఈ పర్యటన ఏర్పాటు చేశారని విశ్లేషిస్తున్నాయి. తెలుగుదేశం మిత్రపక్షమైన బీజేపీ రెండు బడ్జెట్లలోనూ (రైల్వే, సాధారణ) రాష్ట్ర ప్రభుత్వానికి మొండి చేయి చూపింది.అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని బీరాలు పలికిన చంద్రబాబుకు కేంద్రం బడ్జెట్ చుక్కలు చూపించింది. పోలవరానికి కేవలం రూ.100 కోట్లను కేటాయించింది. దీంతో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు రాజధానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలేవీ కేంద్రం బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు రాబట్టేందుకు బడ్జెట్‌కు ముందే పలుమార్లు ఢిల్లీ వెళ్లివచ్చినప్పటికీ ఫలితం లేకపోవడం, మిత్రపక్షమైన బీజేపీ వైఖరిలో వచ్చిన మార్పు, జరీబు గ్రామాల రైతులకు అదనంగా ప్రకటించిన ప్యాకేజీపై వెల్లువెత్తిన వ్యతిరేకత నేపథ్యంలో.. రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటన సాగితే అక్కడి పరిస్థితులు మరింత జటిలంగా మారడంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రమయ్యే అవకాశాలు ఉండటంతో పవన్ పర్యటనను చంద్రబాబు ఖరారు చేశారని అంటున్నారు.

 

అంతా వ్యూహాత్మకంగానే..పవన్ పర్యటన అంతా వ్యూహాత్మకంగానే జరుగుతోందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎప్పుడూ గుంటూరు జిల్లాలో జనసేన నాయకులు రాజకీయ అంశాలపై స్పందించ లేదు. మొన్నటి రెండు బడ్జెట్‌లు, అంతకు పూర్వం రాజకీయ పరమైన అంశాలపై ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎటువంటి పత్రికా ప్రకటనలు కానీ, విమర్శలు కానీ  చేయలేదు. అయితే గురువారం ఆకస్మికంగా మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో కొందరు తమను కాపాడాలంటూ పవన్ కల్యాణ్‌ను కోరారు.మీడియా ఎదుట పవన్‌ను ఉద్దేశించి ‘నిదురలేచి, ప్రభుత్వాన్ని ప్రశ్నించి తమ పూల తోటలను కాపాడాలి..’ అంటూ నినాదాలు చేశారు. శుక్రవారం ఉదయం గ్రామసెంటర్‌లో ధర్నా చేపట్టనున్నామని ప్రకటించారు. ఆ మేరకు శుక్రవారం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే.. పవన్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమం ఓ పథకం ప్రకారమే జరిగిందనే అనుమానాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. కాగా దీని వెనుక బాబు వ్యూహం ఉందనే విషయం ఆదివారం ఖరారైన పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల పర్యటన స్పష్టం చేసిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజధాని గ్రామాల్లో పవన్‌ను పర్యటింప జేసే ఉద్దేశంతోనే.. ధర్నా కార్యక్రమాలు చేపట్టారని స్పష్టం చేస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top