అక్రమ కట్టడం కూల్చివేత

Officials Demolished Of Praja Vedika Building - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే మొదలవ్వాలన్న సీఎం సూచనల మేరకు..కృష్ణానది కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆ భవనాన్ని కూల్చివేసే చర్యలను ప్రారంభించారు. ఈ సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లను చేపట్టారు. భవనంలోని ఫర్నించర్‌ను, ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. భవనాన్ని కూల్చివేసేందుకు ఇప్పటికే జేసీబీలు, కూలీలను ప్రజావేదిక వద్దకు తరలించారు.

(చదవండి : ‘ప్రజావేదిక’పై సీఎం జగన్‌ సంచలన నిర్ణయం)

కాగా, ప్రజావేదికపై ఇప్పటికే ప్రభుత్వానికి సీర్‌ఆర్‌డీఏ నివేదిక సమర్పించింది. ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నివేదికలో పేర్కొంది. అధికారంలో ఉండగా తన అక్రమ నివాసం పక్కన చంద్రబాబు అనధికారికంగా కట్టించిన ప్రజావేదిక అక్రమాలు, దుర్వినియోగాలకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు సహా ఆయన కుమారుడు, టీడీపీ నేతలు దాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు. పేరుకు ప్రభుత్వ భవనమే అయినా ఇన్నాళ్లు దానిని టీడీపీ కార్యాలయంగా వాడుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం వినియోగించుకున్న చంద్రబాబు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదలకుండా వేలాడుతుండడం విమర్శలకు దారితీసింది. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా దాన్ని తనకే ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top