ఎన్నికల సామగ్రి ఎత్తుకెళ్లారు!

Officers Working In Election Department Of The Chittoor Collectorate Have Robbed The Purchased Election Items - Sakshi

కలెక్టరేట్‌లో దోపిడీ పర్వం 

కోట్లాది రూపాయల విలువ చేసే వçస్తువులు మాయం

ఎన్నికల విభాగం అధికారుల అక్రమ దోపిడీ 

సీఈఓ, ముఖ్యమంత్రి దృష్టికి అక్రమ వ్యవహారం

ఒక రూపాయి.. రెండు రూపాయలు కాదు.. కోట్ల విలువ చేసే ఎన్నికల పరికరాలను దోచుకెళ్లారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఎన్నికల వస్తువులను కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న అధికారులు గుట్టుచప్పుడు కాకుండా తమ ఇళ్లకు మోసుకెళ్లారు. ఎవరికీ అనుమానం రాకూడదని అదే సెక్షన్‌లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా కొన్ని పంచిపెట్టారు. గత కలెక్టర్‌ ప్రద్యుమ్న, జేసీ గిరీషా ఆధ్వర్యంలో వాటిని కొనుగోలు చేశారు. వారు బదిలీ కావడంతో ఇదే అదనుగా భావించిన ఎన్నికల విభాగం అధికారులు కోట్ల విలువ చేసే వస్తువులను మాయంచేశారు. ఈ అక్రమ దోపిడీ తతంగంపై కలెక్టరేట్‌లోని సహచర ఉద్యోగులు కోడై కూస్తున్నారు. అక్రమాలపై ఇప్పటికే పలువురు కలెక్టరేట్‌ ఉద్యోగులు రాష్ట్ర ఎన్నికల అధికారికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. 

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌ : ఆదర్శంగా ఉండాల్సిన అధికారులు అక్రమ దోపిడీకి తెరలేపారు. ఈ వ్యవహారం కలెక్టరేట్‌లోని అన్ని శాఖల్లో దుమారం లేపుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. ఆ బడ్జెట్‌లో జిల్లా స్థాయిలో అవసరమైన సామగ్రి, విలువైన వస్తువులను అధికారులు కొనుగోలుచేశారు. వాటిని రికార్డుల్లో నమోదు చేసి కార్యాలయ పనులకు, రాబోయే ఎన్నికలకు వినియోగించాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల అధికారిగా పనిచేసిన ప్రద్యుమ్న, డిప్యూటీ ఎన్నికల అధికారిగా పనిచేసిన గిరీషా బదిలీ అయ్యారు. ఇదే అదునుగా భావించిన కలెక్టరేట్‌ ఎన్నికల విభాగంలోని కొందరు అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. కలెక్టరేట్‌లో ఉండాల్సిన విలువైన వస్తువులను మాయం చేసి ఇళ్లకు తీసుకెళ్లారని తెలిసింది.

బిల్లులన్నీ తారుమారు
ఎన్నికల కసరత్తుకు చేపట్టిన పనులకు ఇచ్చిన బిల్లుల్లో అన్నీ తారుమారు చేశారని తెలిసింది. ఎన్నికల్లో నిర్వహించిన పనులకు పర్సంటేజీలు అధికంగా నగదు నమోదుచేసి దొంగ బిల్లులు పెట్టారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రూ. 57 కోట్లు  బడ్జెట్‌ కావాలని జిల్లా యంత్రాంగం ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది. అందులో ఇప్పటివరకు రూ.22 కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అందులో ఖర్చుచేసిన నిధులకు ఆడిట్‌ లేకపోవడంతో ఆ విభాగం అధికారులు చేతివాటం ప్రదర్శించారని విమర్శలు వెలువెత్తుతున్నాయి.  

మాయమైన వస్తువులు ఇవే 
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ఎంసీఎంసీ సెల్, కాల్‌సెంటర్, సీ–విజిల్, కమాండ్‌ కంట్రోల్‌ రూం, ఎన్నికల విభాగంలో కొన్ని వస్తువులను కొనుగోలుచేశారు. ఆ వస్తువులు ప్రస్తుతం కనిపించలేదని తెలిసింది. 
1. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ఎంసీఎంసీ సెల్‌లో రూ.50 వేలు విలువ చేసే ఎల్‌ఈడీ టీవీలు 10 కొనుగోలు చేశారు. 
2. ఎన్నికల పర్యవేక్షణకు వచ్చిన అబ్జర్వర్లు 45 మందికి రూ. 30 వేలు విలువ చేసే ఆండ్రాయిడ్‌ ఫోన్లను కొనుగోలుచేశారు. జిల్లాలోని 14 నియోజకవర్గ ఆర్వోలకు మొబైల్‌ ఫోన్లను కొని ప్రత్యేక సిమ్‌ను వేసిచ్చారు. 
3. సీ విజిల్, 1950 కాల్‌ సెంటర్‌కు ఫోన్లు ల్యాప్‌టాప్‌లు, నెట్‌ మోడెమ్‌లు దాదాపు 20 వరకు కొనుగోలుచేశారు.  
4. కమాండ్‌ కంట్రోల్‌ రూం పర్యవేక్షణకు రూ.70 వేలు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు 80 వరకు కొనుగోలు చేశారు. 
5. ఎన్నికల్లో మోడల్‌ కోడ్‌ వయోలేషన్, ప్రచారాల ఫొటోలు తీయడానికి రూ.50 విలువ చేసే డిజిటల్‌ కెమెరాలు 20 వరకు కొనుగోలు చేశారు. 
ఇలా ఎన్నికలకు కొనుగోలు చేసిన విలువైన వస్తువుల్లో చాలావరకు ప్రస్తుతం కలెక్టరేట్‌లో లేకపోవడంతో కలెక్టరేట్‌లో ఎన్నికల విభాగంలో విధులు నిర్వహించిన అధికారులపై విమర్శలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top