చిత్రకొండ పరిసరాల్లో ఆర్కే?

Odisha Steps up Combing Operation Against Maoist Top Leader RK - Sakshi

సాక్షి, మల్కన్‌గిరి: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ (ఆర్కే) ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పరిసరాల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో ఒడిశా పోలీస్‌ యంత్రాంగం కూంబింగ్‌ ముమ్మరం చేసింది. ఆర్కేతోపాటు మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు ఉదయ్, చలపతి కూడా ఇదే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆపరేషన్‌ ఆర్కే పేరుతో గాలింపు మొదలుపెట్టారు. ఎస్‌వోజీ, డీబీఎఫ్‌లతో పాటు ఆంధ్ర గ్రేహౌండ్స్, తూర్పు గోదావరి జిల్లా పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. 

ఉనికి కోసం మావోయిస్టుల యత్నాలు
గతంలో చిత్రకొండ కటాఫ్‌ ఏరియా మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడు కటాఫ్‌ ఏరియాలో రహదారుల నిర్మాణం జరగడం, అలాగే ఎక్కడికక్కడ బీఎస్‌ఎఫ్‌ క్యాంపులు ఏర్పాటై జవాన్లు నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తుండటంతో మావోయిస్టుల అలజడి తగ్గుముఖం పట్టింది. ఈ ప్రాంతంపై తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు ఇక్కడ జరుగుతున్న రోడ్ల నిర్మాణాలను అడ్డుకోవడం, కాంట్రాక్టర్ల వాహనాలు కాల్చివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఈ ఏరియాలోనే ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ నెల 15వ తేదీన చిత్రకొండ కటాఫ్‌ ఏరియాలో కూంబింగ్‌ చేపట్టగా ఎదురు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అగ్రనేతలు తప్పించుకున్నారు. అనంతరం మావోయిస్టు శిబిరం నుంచి పోలీసులు మావోల సామగ్రితో పాటు ఒక పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెన్‌డ్రైవ్‌లో ఉన్న వివరాలను మాత్రం బయటకు పొక్కనివ్వలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top