4 వేలకు చేరువలో కోలుకున్నవారి సంఖ్య

Number of Corona recoveries in AP is 4 thousand - Sakshi

రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య 3,905

మొత్తం పాజిటివ్‌ కేసులు 7,961

ఇప్పటివరకు మృతిచెందినవారు 96

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య నాలుగు వేలకు చేరువైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో 133 మంది డిశ్చార్జి అయినట్లు పేర్కొంది. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,905కు చేరుకుంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 17,609 మందికి పరీక్షలు నిర్వహించగా 465 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. దీంతో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 7,961కి చేరింది. ఇందులో 1,423 కేసులు ఇతర రాష్ట్రాలు, 308 కేసులు విదేశాల నుంచి వచ్చినవారివి కాగా మిగిలినవి రాష్ట్రానికి చెందినవి. కొత్తగా నాలుగు మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 96కు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,960గా ఉంది.

40 ఏళ్లు దాటితే జాగ్రత్తలు పాటించాల్సిందే 
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి 
నలభై ఏళ్లు పైబడిన హై రిస్క్‌ గ్రూప్‌ వారు కూడా కోవిడ్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి సూచించారు. ఊపిరితిత్తులు, ఆస్తమా సంబంధిత సమస్యలున్నవారు, స్టెరాయిడ్స్‌ వాడుతున్నవారు, అతిగా పొగ తాగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే కేవలం జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలే కాకుండా శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బందులున్నా దగ్గర్లోని పీహెచ్‌సీని సంప్రదించాలన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

► ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే 104 టోల్‌ ఫ్రీ నంబర్‌ లేదా, వైఎస్సార్‌ టెలీ మెడిసిన్‌ 14410 నంబర్‌కు ఫోన్‌ చేయాలి. 
► స్థానిక ఆశా వర్కర్‌ లేదా, గ్రామ/వార్డు వాలంటీరుకు సమాచారమివ్వాలి.
► ఆస్తమా, ఆయాసం ఉన్నా ఏమీ కాలేదన్న ధీమా వీడాలి.  
► బీపి , షుగర్‌ , గుండె జబ్బులతో పాటు హైరిస్క్‌ గ్రూపు వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి.
► 40–49 ఏళ్ల వారికి శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బందులున్నా దగ్గల్లోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను తక్షణం సంప్రదించాలి.  

జైళ్లలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు 
రాష్ట్రంలోని పలు జైళ్లలో ఐదుగురు ఖైదీలకు కరోనా పాజిటివ్‌ సోకడంతో జైళ్లశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడికి మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జైళ్ల శాఖ ఐజీ జయవర్ధన్‌ తెలిపారు. 
► కోవిడ్‌ నేపథ్యంలో రద్దీగా ఉన్న జైళ్ల నుంచి 463 మంది ఖైదీలకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చారు. గడువు ముగిసిన అనంతరం వారు జైలుకు తిరిగి రావాలి. 
► రాష్ట్రంలోని 91 జైళ్లలో 5,800 మంది ఖైదీలున్నారు. వారికి కరోనా సోకకుండా చర్యలు చేపట్టారు. 
► ఖైదీలతో కుటుంబసభ్యులు, బంధు మిత్రుల ములాకాత్‌లు రద్దు. ఫోన్‌లో మాట్లాడుకొనే సౌలభ్యం కల్పించారు. 
► జైలు పరిసరాల్లో శానిటైజేషన్‌ చేస్తున్నారు. ఖైదీలకు థర్మల్‌ స్క్రీనింగ్, మాస్క్‌లు, గ్లౌజులు అందించడంతోపాటు వారు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. 

ఆ ఐదుగురు కొత్త ఖైదీలే.. 
రాష్ట్రంలో రాజమహేంద్రవరం, నెల్లూరు, కడప, అనంతపురం జైళ్లలో ఐదుగురు ఖైదీలకు పాజిటివ్‌ వచ్చింది. వారంతా జైలుకు కొత్తగా వచ్చిన వారే. ఖైదీలను జైలుకు తీసుకొచ్చే ముందే కోవిడ్‌ పరీక్ష చేయిస్తున్నారు. కొత్త ఖైదీలను తీసుకొచ్చిన వెంటనే వారిని 21 రోజల పాటు ఐసోలేషన్‌ వార్డులో ఉంచి తర్వాత పాత ఖైదీలు ఉండే బ్యారక్‌కు తరలిస్తాం. 
    – జైళ్ల శాఖ ఐజీ జయవర్ధన్‌     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top