జన్మభూమి సభలను టీడీపీ ప్రభుత్వం ప్రచార సభలుగా వినియోగించుకోవడం తప్ప సంక్షేమ పథకాలు ఊసెత్తడం లేదని వైఎస్సార్ సీపీ నాయకుడు,
పూలపల్లి (పాలకొల్లు అర్బన్) : జన్మభూమి సభలను టీడీపీ ప్రభుత్వం ప్రచార సభలుగా వినియోగించుకోవడం తప్ప సంక్షేమ పథకాలు ఊసెత్తడం లేదని వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. పూలపల్లిలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జన్మభూమిలో పింఛన్‌లతో సరిపెడుతున్నారని, అయితే గృహనిర్మాణ పథకంలో కొత్త ఇళ్లు మంజూరు లేవన్నారు. ఇసుక ర్యాంపులకు విధివిధానాలు నిర్ణయించి వేలం పాటలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల భవన కార్మికులు, తాపీమేస్త్రిలు, మత్స్యకారులు ఉపాధి కరువై వీధినపడ్డారని శేషుబాబు ఆరోపించారు. అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయన్నారు. కొత్తగా పింఛన్‌లు మంజూరు చేయలేదని, పైగా పాత పింఛన్‌లే కుంటిసాకులతో ఏరివేతకు పునుకుంటున్నారని దుయ్యబట్టారు. రైతు రుణ, డ్వాక్రా రుణమాఫీ విషయంలో చంద్రబాబు రోజుకో కట్టుకథ చెబుతున్నారని శేషుబాబు విమర్శించారు.
ధర్నాను విజయవంతం చేయండి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు నెలల పాలనపై బుధవారం ఉదయం పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ శేషుబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, పార్టీ మండల కన్వీనర్ మైలాబత్తుల మైఖేల్‌రాజు, నడపన గోవిందరాజుల నాయుడు, మాజీ ఎంపీటీసీ కండిబోయిన శివన్నారాయణ, కవురు సత్యనారాయణ (గాంధీ) పాల్గొన్నారు.