
మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతా
‘‘రాష్ట్ర విభజన హేతుబద్ధంగా చేపట్టలేదు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్. ఆదాయం లేదు.. అప్పులున్నాయి.
ఆర్థికలోటు ఉన్నా ప్రణాళికబద్ధంగా రాష్ట్ర అభివృద్ధి : సీఎం
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘రాష్ట్ర విభజన హేతుబద్ధంగా చేపట్టలేదు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్. ఆదాయం లేదు.. అప్పులున్నాయి. అధైర్యపడితే ముందుకెళ్లలేం. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకునేందుకు ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తున్నా. 2029 నాటికి భారతదేశంలో నంబర్-1గా, 2050 నాటికి ప్రపంచంలోనే మేటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నా’నని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కడప కార్పొరేషన్ 49వ డివిజన్ పరిధిలోని ఆలంఖాన్‌పల్లెలో శనివారం నిర్వహించిన జన్మభూమి-మా ఊ రు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అన్ని వనరులున్న ఆంధ్రప్రదేశ్‌లో 900 కిలోమీటర్లు కోస్టల్ కారిడార్ ఉందని, పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తూ లక్ష్యం సాధిస్తామని చెప్పారు. పట్టిసీమ పథకం ద్వారా 8 టీఎంసీల నీరు డెల్టాకు తెచ్చామని, ఆ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసి రాయలసీమకు అందిస్తామని చెప్పారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కొత్తగా కొత్తగా ఆలోచించాలని సీఎం పిలుపునిచ్చారు. కడపలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు.
సంక్రాంతి కానుకలో అవినీతి సహించం
సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో అవినీతి, అక్రమాలు జరిగితే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంపై ఆయన శనివారం కాకినాడ నుంచి రాష్ట్రంలోని 8 వేల మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నెల 19న దావోస్‌కు బాబు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుఈ నెల 19న దావోస్ (స్విట్జర్లాండ్) వెళ్లనున్నారు. 24వ తేదీ వరకు ఆయన అక్కడే ఉంటారు. ఆయన వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.