రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇక్కడి స్టేషన్లలో ప్రత్యేక సదుపాయాలు
ఏలూరు/భీమవరం :రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇక్కడి స్టేషన్లలో ప్రత్యేక సదుపాయాలు కల్పిం చాలని, నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ నిర్మించాలని, భీమవరం-గుడివాడ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు అధిక నిధుల కేటాయించాలని, విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన ఎంపీలు రైల్వే మంత్రి సురేష్‌ప్రభుకు ప్రతిపాదనలు ఇచ్చారు. బడ్జెట్ ప్రకటనను చూస్తే అవన్నీ బుట్టదాఖలైనట్టు స్పష్టమైంది.
ఎంపీలను దూరం పెట్టారా
బడ్జెట్ కసరత్తులో భాగంగా ఎంపీల నుంచి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రతిపాదనలు స్వీకరించారు. చివరకు వాటిని పట్టించుకోలేదు. ఈ తీరు చూస్తుంటే ఎంపీలను దూరం పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే సౌకర్యాల కోసం ఎంపీ కోటా నిధులను వెచ్చించాలని సూచించడం ఎంపీలను అయోమయంలోకి నెట్టేసింది.
లిఫ్ట్‌లు.. ఎస్కలేటర్లు ఏ స్టేషన్లకో..
ప్రధాన రైల్వేస్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. జిల్లాలోని ఎన్ని స్టేషన్లకు ఈ సౌకర్యం కల్పిస్తారనేది తేలాల్సి ఉంది. అసలు మన జిల్లాలోని స్టేషన్లను ప్రధాన స్టేషన్లుగా పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్నది అనుమానంగానే ఉంది. మరోవైపు గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం స్టేషన్లలో సదుపాయాలు ఏమైనా కల్పిస్తారా లేదా అన్నది స్పష్టం కాలేదు. బడ్జెట్‌లో ఈ ప్రస్తావన కనిపించలేదు. ఇదిలావుండగా, దేశవ్యాప్తంగా 970 చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. మన జిల్లాల్లో 15చోట్ల ఆర్వోబీలు నిర్మించాలనే ప్రతిపాదనలు దశాబ్దాల క్రితమే రైల్వే శాఖకు వెళ్లాయి. ఈసారైనా ఈ ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.
కోటిపల్లికి దారేది
కమలనాథులపై ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కోనసీమ రైల్వే ప్రాజెక్ట్‌పై పెట్టుకున్న ఆశలు ఈసారి కూడా నెరవేరలేదు. నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి యూపీఏ సర్కారు తరహాలోనే ఎన్డీయే కూడా మొండిచెయ్యి చూపించింది. గత ఏడాది బడ్జెట్‌లో ఈ లైన్‌కు రూ.11 కోట్లు కేటాయిం చగా, ఈసారి రూ.5 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజె క్ట్ ప్రతిపాదనల్ని సజీవంగా ఉంచడానికి మినహా ఈ కేటాయింపులు ఎందుకూ సరిపోవు. అదేవిధంగా విజయవాడ-భీమవరం బ్రాంచిలైన్ డబ్లింగ్ పనుల కోసం రూ.1,500 కోట్లు అవసరం కాగా, ఈ ఏడాది కేవలం రూ.150 కోట్లు మాత్రమే కేటాయించారు.