ఆలోచన.. విజన్‌.. ప్రణాళికల్లో సీఎం భేష్‌

Niti Aayog vice chairman Rajiv Kumar praises AP CM YS Jagan - Sakshi

ముఖ్యమంత్రి జగన్‌పై నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ ప్రశంసలు

మీ సీఎం అంకితభావం,దూరదృష్టి నన్ను ఆకట్టుకున్నాయి

3 నెలల్లోనే చక్కటి పనితీరు చూపారు

ఏపీ అభివృద్ధి పథంలో ముందుండేలా తోడ్పాటు అందిస్తాం

మానవాభివృద్ధి సూచీలను పెంచుకునేందుకు సహకరిస్తాం

రాష్ట్ర రెవెన్యూ లోటు కాస్త ఆందోళనకరమే.. బడ్జెటేతర ఖర్చులు పెరుగుతున్నాయి

పెట్టుబడులు, పబ్లిక్‌ రుణాలపై దృష్టి సారించాలి

ఆంధ్రప్రదేశ్‌కు చేయదగ్గ సహాయం అంతా చేస్తాం. తగిన రీతిలో సహకారం అందిస్తాం. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండేలా తోడ్పాటునిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంకితభావం, విజన్‌ నన్ను ఆకట్టుకున్నాయి. అధికారంలోకి వచ్చిన మూడు, నాలుగు నెలల్లోనే సీఎం చక్కటి పనితీరు చూపారు.
– నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన, దూరదృష్టి, ప్రణాళికలు చాలా బాగున్నాయని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ వచ్చినప్పుడు తనతో సుదీర్ఘంగా చర్చించారని, నవరత్నాల గురించి వివరించారని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయం, ఉద్యాన, రెవెన్యూ రంగాల్లో చేపట్టిన చర్యలు, వివిధ రంగాల్లో అవకాశాలపై రాజీవ్‌కుమార్‌ శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో కలసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంకితభావం, విజన్‌ తనను ఆకట్టుకున్నాయని ఈ సందర్భంగా రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు, నాలుగు నెలల్లోనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చక్కటి పనితీరు చూపారని అభినందించారు. 

అక్షరాస్యతలో వెనుకబాటు
ఆంధ్రప్రదేశ్‌కు తాము చేయదగ్గ సహాయం అంతా  చేస్తామని, తగిన రీతిలో సహకారం అందిస్తామని రాజీవ్‌కుమార్‌ చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండేలా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. మానవాభివృద్ధి సూచికలను పెంచేందుకు తగిన రీతిలో సహకారం అందిస్తామన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని, ఏపీ పారిశ్రామిక వాటా కూడా తక్కువగా ఉందని చెప్పారు. ఏపీ బడ్జెట్‌లో సగానికిపైగా మానవ వనరుల వృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారని, పారిశుధ్య కార్యక్రమాలు బాగా నిర్వహిస్తున్నారని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై ముందడుగు వేయాలని సూచించారు. జీరో బడ్జెట్‌ నేచరల్‌ ఫార్మింగ్‌కు తాను అనుకూలమని, దీన్ని పోత్సహించాలన్నారు. దేశవ్యాప్తంగా పప్పు దినుసులు, నూనెగింజల సాగు పెంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వాటికి సరైన మద్దతు ధర లభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

రెవిన్యూ లోటు ఎక్కువే..
రాష్ట్ర రెవిన్యూ లోటు కాస్త ఆందోళనకరంగా ఉందని, బడ్జెటేతర ఖర్చులు పెరిగినట్టు కనిపిస్తున్నాయని రాజీవ్‌కుమార్‌ చెప్పారు. పెట్టుబడులు, పబ్లిక్‌ రుణాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు.

ఏపీ మహిళల్లో ఆందోళనకర స్థాయిలో ఎనీమియా 
మహిళల్లో రక్తహీనత రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉందని రాజీవ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా, శిశుసంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు. బియ్యం, వంటనూనెల్లో ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండేలా చూడాలని, దీనిపై కేంద్ర ఆహార శాఖతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆగ్రో ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టిసారించాలని సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top