నిట్‌లో 800 సీట్లు

NIT seats increased In Tadepalligudem - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : ఏపీ నిట్‌లో సీట్ల సంఖ్య 800 పెరుగనుంది. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి తాజాగా ఉత్తర్వులు వచ్చాయి. ఏపీ నిట్‌లో ప్రస్తుతం 480 సీట్లు ఉన్నాయి. వీటిలో 240 సీట్లను హోమ్‌ స్టేట్‌ కోటా కింద రాష్ట్రంలోని విద్యార్థులకు, 240 సీట్లను దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తున్నారు. గూడెం నిట్‌కు దేశవ్యాప్తంగా ఫలితాలు, ఉద్యోగ అవకాశాల కల్పనలో దేశంలోని 31 నిట్‌లలో తొమ్మిదో స్థానం ఉంది. ఏపీ నిట్‌ శాశ్వత భవనాల నిర్మాణ పనులు చేపట్టిన ఎనిమిది నెలల కాలంలో దాదాపు పూర్తి కావచ్చాయి.

2019–20 విద్యాసంవత్సరం తరగతులు శాశ్వత భవనాలలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీ నిట్‌లో సీట్లు ఒక్కసారిగా మరో 320 పెరుగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి అనుమతి వచ్చింది. ప్రస్తుత మున్న 480 సీట్లతో పాటు, సూపర్‌ న్యూమరరీ సీట్ల కింద మరో 120 సీట్లు పెరుగనున్నాయి. వీటిలో 60 సీట్లను రాష్ట్రంలోని విద్యార్థులకు, మరో 60 సీట్ల దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులతో భర్తీ చేస్తారు. ఎకనమికల్లీ వీకర్స్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌ ) కోటా ఈ ఏడాది దేశంలోని 20 నిట్‌లలో మాత్రమే సీట్లను పెంచుకునే అవకాశం కల్పించారు. వచ్చే విద్యాసంవత్సరం 2020–21 నుంచి ఏపీ నిట్‌లో ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 200 సీట్లు అదనంగా భర్తీ చేసుకునేందుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీ నిట్‌లో సీట్ల సంఖ్య 480 నుంచి 800కు పెరుగనుంది.

ఆగస్టు  5 నుంచి తరగతులు
ఈ ఏడాది నిట్‌ విద్యార్థులకు తరగతులు ఆగస్టు ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని నిట్‌ డైరెక్టర్‌ సీఎస్‌పీ రావు తెలిపారు. నిట్‌ సీట్ల భర్తీకి సంబం«ధించి ఏడో రౌండ్‌ ఈ నెల 18న ముగియనుంది. ఇప్పటికే ఏపీ నిట్‌లో ఉన్న అన్ని సీట్లు 486 (సూపర్‌ న్యూమరరీ సీట్లు ఆరుతో కలిపి) విద్యార్థులు ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ప్లోటింగ్‌. ఫ్రీజింగ్, స్టైడింగ్‌ పద్ధతిలో ఆప్షన్‌లు ఇచ్చినందున ఏడో రౌండ్‌ ముగిసిన తర్వాత మాత్రమే ఏ నిట్‌లో ఎంత మంది చేరతారనే అంకె తేలనుంది. 23 నాటికి ఎక్కడ ఎంత మంది విద్యార్థులు చేరారనే విషయం తేలుతుంది. ఏపీ నిట్‌ తరగతులు ఈ విద్యాసంవత్సరం విమానాశ్రయ భూముల దగ్గర  ఉన్న శాశ్వత ప్రాంగణంలో ప్రారంభం అవుతాయి. ల్యాబ్‌ అవసరాలు, ఇతర సదుపాయాలు ఆఖరి సంవత్సరం విద్యార్థులకు అవసరం కావడంతో, తాత్కాలిక వసతిగా ఉన్న వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాల, ఆకుల గోపయ్య ఇంజనీరింగ్‌ కళాశాల, ఏపీ నిట్‌ శాశ్వత భవనాలలో తరగతులు నిర్వహిస్తారు. 

అక్టోబరులో స్నాతకోత్సవం 
ఈ  ఏడాది అక్టోబర్‌లో నిట్‌ స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి నిట్‌ తొలి దశ పనులు పూర్తవుతాయి. స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ మంత్రి హాజరు కానున్నారు. 

అదనంగా రూ.92 కోట్లు 
ఏపీ నిట్‌ వన్, వన్‌బి పనుల కోసం కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ అదనంగా మరో ,రూ.92 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. నిట్‌ రెండు దశల భవనాల పనుల కోసం తొలుత రూ.465 కోట్లు కేటాయించారు. తొలిసారిగా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫైనాన్సింగ్‌ ఏజెన్సీ (హెఫా) ను ఈ పనులకు నిధులు విడుదల చేయడానికి ఏర్పాటు చేశారు. నిట్‌ భవనాల కోసం అయ్యే ఖర్చులో  ఏడు శాతం నిధులను కెనరా బ్యాంకు, 93 శాతం నిధులను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ  ఇస్తుంది. రెండు« దశల పనుల నిమిత్తం కేటాయించిన రూ.465 కోట్లలో ఇప్పటికే రూ.275 కోట్లను విడుదల చేశారు. 

వన్‌బీ భవనాల పనులను తొలి దశ భవనాల నిర్మాణం చేపట్టిన పూనాకు చెందిన బీఎం.షిర్కే కంపెనీకే ఇచ్చారు. భవనాల నిర్మాణాలకు రూ.465 కోట్లు సరిపోవని, ఇంకా నిధుల అవసరం ఉందని డైరెక్టర్‌ సీఎస్‌పీ.రావు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖను కోరారు. దీంతో భవనాల నిర్మాణం కోసం మరో రూ.92 కోట్లు మంత్రిత్వశాఖ కేటాయించింది. వాస్తవానికి కేంద్రం పర్యవేక్షణలో నిర్మించే భవనాల పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించే నిధులు రూ.500 కోట్లు జీఎస్టీతో కలిపి చేరితే నీతి ఆయోగ్‌ అనుమతి తీసుకోవాలి. నిట్‌ భవనాల ప్రాధాన్యత దృష్ట్యా , తక్కువ కాలంలోనే సాధించిన ప్రగతిని బేరీజు వేసుకొని మొత్తం నిధులు రూ.557 కోట్లు కేటాయించారు. రెండోదశ (వన్‌బీ) పనులు నిమిత్తం భవనాల డ్రాయింగ్‌లు సిద్ధమయ్యాయి. అడ్మినిస్ట్రేటివ్‌ కాంప్లెక్సు, తరగతి గదులు, ల్యాబ్‌ కాంప్లెక్సు, రెండు బాలుర హాస్టల్స్, వీటిలో ఒకటి నాలుగు అంతస్తులతో, ఒకటి సింగిల్‌ అంతస్తుతో నిర్మిస్తారు. వన్‌బీ పనుల కోసం రూ.196 కోట్లు వెచ్చిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top