జిల్లాకు కొత్త రెసిడెన్షియల్ స్కూల్ (ఆరో తరగతి నుంచి పది వరకు) మంజూరైనట్లు సమాచారం. బీసీ సంక్షేమ శాఖ ద్వారా పాఠశాలకు సంబంధించిన నివేదికలు,
- జిల్లాకు కొత్త రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు
విజయనగరం : జిల్లాకు కొత్త రెసిడెన్షియల్ స్కూల్ (ఆరో తరగతి నుంచి పది వరకు) మంజూరైనట్లు సమాచారం. బీసీ సంక్షేమ శాఖ ద్వారా పాఠశాలకు సంబంధించిన నివేదికలు, వివరాలను తెలియజేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఇక్కడి అధికారులను కోరారు. మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. పూసపాటిరేగ మండలం కుమిలిలోని బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో తాత్కాలికంగా తరగతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకునే అవకాశముంది.
కుమిలిలోని ఈ రెండు వసతిగృహాలూ ఇటీవలే ఇతర వసతిగృహాల్లో విలీనమయ్యాయి. ఇందులోని విద్యార్థులు సమీపంలోని వసతిగృహాలకు వెళ్లడంతో ఈ వసతిగృహాలకు చెందిన భవనాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ భవనాలను కొత్తగా మంజూరైన రెసిడెన్షియల్ పాఠశాలకు తాత్కాలికంగా వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పాఠశాలకు రూ.15 కోట్లు కేటాయించే అవకాశముంది. రాష్ట్రంలోని అన్ని తీరప్రాంతాలున్న జిల్లాల్లో కూడా ఇటువంటి పాఠశాలలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం జిల్లాకు సంబంధించి ఈ నిధులతో చింతపల్లిలో కొత్త భవనం నిర్మించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ భవన నిర్మాణం కోసం చింతపల్లిలో 7.08 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించారు. స్థలం వివరాలను స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు అంగీకరిస్తే కొత్త భవన నిర్మాణం ప్రారంభమవుతుంది.
ఇంటిగ్రేటెడ్ వసతిగృహ స్థాయి పెంపునకు స్థలం కరువు
రాష్ట్రంలోని ఇంటిగ్రేటెడ్ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెంచి డార్మెటరీలు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన స్థలం ఆ పరిసరాల్లో ఉందో, లేదో చెప్పాలని ఉన్నతాధికారులు బీసీ సంక్షేమ శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో చీపరుపల్లిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వసతిగృహాన్ని పరిశీలించిన జిల్లా అధికారులు అదనపు తరగతి గదులు నిర్మాణానికి సరిపడా స్థలం లేదని ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రస్తుతం నూట పది మంది విద్యార్థులున్న ఈ సమీకృత వసతిగృహం స్థాయి పెంచితే 960 మంది విద్యార్థులు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, తదితరులు) చదువుకోవడానికి వీలుపడుతుంది.