నెల్లూరులో టీడీపీకి షాక్‌   | Nellore Tdp In Shock | Sakshi
Sakshi News home page

నెల్లూరులో టీడీపీకి షాక్‌  

Mar 13 2019 8:34 AM | Updated on Mar 23 2019 8:59 PM

Nellore Tdp In Shock - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన సన్నపురెడ్డి, వాణిజ్య సంఘాల నాయకులు  

సాక్షి, నెల్లూరు(సెంట్రల్‌): జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరొక షాక్‌ తగిలింది. అటు రాజకీయ, ఇటు  వ్యాపార రంగంలో తన కంటూ ప్రత్యేకత సంపాదించుకున్న సన్నపురెడ్డి పెంచల్‌రెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగి, నాలుగేళ్ల క్రితం టీడీపీ చేరారు. అప్పటి నుంచి టీడీపీలో అనేక అవమానాలు భరించారు. టీడీపీ కార్యవర్గంలో స్థానం కల్పించక పోవడంతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ప్రధానంగా సన్నపురెడ్డి పెంచల్‌రెడ్డితో పాటు పలు వాణిజ్య అసోసియేషన్‌ నాయకులు అప్పట్లో టీడీపీలో చేరారు. ఆ పార్టీలో  అవమానాలు భరించ లేక ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో చేరారు. నెల్లూరు నగర, రూరల్‌లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా వాణిజ్య అసోసియేషన్లు ఉన్నాయి. వీరు వైఎస్సార్‌సీపీలో చేరికతో జిల్లాలో టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది.  
 

వైఎస్‌ జగన్‌ సమక్షంలో చేరిక 
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్‌ పి.రూప్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మంగళవారం సన్నపురెడ్డి పెంచలరెడ్డి, సుబ్బారెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దాసా లక్ష్మీనారాయణ, డాల్‌ మిల్లర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ పెసల నరసింహస్వామి, సింహపురి వాణిజ్యమండలి జనరల్‌ సెక్రటరీ సొల్లేటి వెలుగొండయ్య, కేన్వాసింగ్‌ ఏజెన్సీ అధ్యక్షుడు బీఎంఎస్‌ కృష్ణకిషోర్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement