‘మేఘాద్రి’లో స్టైరిన్‌ లేదు

NEERI Released Of Report On Styrene At Visakhapatnam - Sakshi

నివేదికలో వెల్లడించిన ‘నీరీ’ 

ప్రత్యేకంగా శుద్ధి చేసి వినియోగించాలని సూచన

సాక్షి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి విషవాయువు లీకైన ఘటనలో మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌ స్టైరిన్‌తో కలుషితమైపోయిందన్న అనుమానాల్ని నివృత్తి చేస్తూ నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (నీరీ) మంగళవారం నివేదికను విడుదల చేసింది. దుర్ఘటన జరిగిన తర్వాత తీసిన శాంపిల్స్‌లో ఎలాంటి స్టైరిన్‌ అవశేషాలు లేవంటూ నాగ్‌పూర్‌లోని నీరీ సంస్థ రిపోర్టులో వెల్లడించింది. పంపించిన శాంపిళ్ల నివేదికను నీరీ శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. నీటిలో ఏయే లవణాలు ఎంత మోతాదులో ఉన్నాయి. ఇతర పరిమాణాలు ఎలా ఉన్నాయనే విషయాల్ని సీఎస్‌ఐఆర్‌–నీరీకి చెందిన 15 మంది శాస్త్రవేత్తల బృందం పూర్తిస్థాయిలో పరిశీలించింది.

మే 12 నుంచి 16వ తేదీ వరకు మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్‌లోని నీటి శాంపిళ్లను పరీక్షలకు సేకరించింది. నీటి నాణ్యత పరీక్షలతో పాటు బయో ఎస్సే పరీక్షలు కూడా నిర్వహించారు. రిజర్వాయర్‌ నీటిలో స్టైరిన్‌ అవశేషాలు అతి స్వల్పంగా ఉన్నాయని.. దానితో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. పీహెచ్‌ లెవెల్స్‌ కూడా సాధారణంగా ఉన్నాయని తెలిపింది. సోడియం, ఇతర గాఢ లవణాల శాతం ఎక్కువగా ఉందనీ, ఈ కారణంగా నేరుగా తాగునీటి కోసం వినియోగించొద్దని నీరీ సూచించింది.

గాఢ లవణాలు తీసేస్తే, కంబైన్డ్‌ ఓజోన్‌ యాక్టివేటెడ్‌ కార్బన్‌ ట్రీట్‌మెంట్‌ పద్ధతి ద్వారా శుద్ధి చేసిన తర్వాత మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లోని నీటిని యథాతథంగా వినియోగించవచ్చని స్పష్టం చేసింది. స్టైరిన్‌ అవశేషాలు మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లోని నీటిలో లేవంటూ నీరీ శాస్త్రవేత్తలు ప్రాథమికంగా చెప్పారనీ, అయితే నివేదిక ఇంకా తమ చేతికి అందలేదని జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాతే నీటిని వినియోగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: సెల్‌లో ఫొటోలు తీసి... ఆపై గర్భవతిని చేసి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top