రహదారి రాజకీయం | National Highway Construction Delayed in Prakasam | Sakshi
Sakshi News home page

రహదారి రాజకీయం

Apr 20 2019 11:44 AM | Updated on Apr 20 2019 11:44 AM

National Highway Construction Delayed in Prakasam - Sakshi

జాతీయ రహదారి అభివృద్ధికి భూ సేకరణ కోసం సర్వే చేస్తున్న అధికారుల బృందం

జాతీయ రహదారులు రానురాను అధ్వానంగా తయారవుతున్నాయి. ప్రజల అవసరాలు పెరిగినంతగా రవాణా వ్యవస్థ మెరుగుపడ లేదు. సౌకర్యవంతమైన ప్రయాణం, సరుకుల రవాణాలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇక కొత్త ప్రాజెక్టులు.. ప్రతిపాదనలను తయారు చేస్తున్నా చిత్తశుద్ధి కొరవడటంతో అడుగు ముందుకు పడటం లేదు. రకరకాల ప్రణాళికలు ఏళ్ల తరబడి ఊరిస్తూనే ఉన్నాయి. ఆర్భాటంగా ప్రకటించిన అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేదీ ఇదే దారిలో ఉంది.

ఒంగోలు సిటీ: జిల్లాలో ఒంగోలు, కనిగిరి, మార్కాపురం రోడ్లు భవనాల డివిజన్ల పరిధిలో 992.260 కిమీ జాతీయ రహదారులు ఉన్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రహదారులను అప్‌గ్రేడ్‌ చేయడం, కొత్త ప్రాజెక్టులను చేపట్టడం, ప్రసుత్తం ఉన్న జాతీయ రహదారులను విస్తరించే పనులను వేగంగా చేయాలి. ప్రజల ఆశలకు అనుగుణంగా రహదారుల అభివృద్ధి జరగడం లేదు. జిల్లాలో మొత్తం 3,709.860 కి.మీ రహదారులు ఉంటే వీటిలో 992.260 కి.మీ మాత్రమే జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిలో జిల్లా ప్రధాన రహదారులు 1,794.952 కి.మీ, గ్రామీణ రహదారులు 922.648 కి.మీ ఉన్నాయి. ఇందులో సిమెంట్‌ కాంక్రీటు రోడ్లు 296.805 కి.మీ, తారు రోడ్లు 3,152.054 కి.మీ, మట్టిరోడ్లు 261.001 కి.మీ ఉన్నాయి. ఇంత అభివృద్ది చెందుతున్నా, పాలకులు రూ.కోట్లతో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామంటున్నా ఇంకా మట్టిరోడ్లు దర్శనమిస్తున్నాయి. తారు రోడ్లలోనూ 1,376 కి.మీ వరకు దెబ్బతిన్నాయి. విపరీతమైన గుంతలు ఉన్నాయి. ఒంగోలు డివిజన్‌ పరిధిలోని రోడ్లయితే ఇంకా బాగా దెబ్బతిని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉంటే రవాణా వ్యవస్ధ ఏ పాటిగా మెరుగుపడ్తుందన్న విమర్శలు ఉన్నాయి.

పర్సంటేజీలకే సరి..
జిల్లా నుంచి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మంత్రిగా పని చేసిన కాలంలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. తన అనుయాయులకు రోడ్లు కాంట్రాక్టులు ఇచ్చారని, దండిగా పర్సంటేజీలు చేతులు మారాయని, ఎమ్మెల్యేలు తాము అనుకున్న వారికి కాంట్రాక్టులు ఇప్పించి సొమ్ము చేసుకున్నారని, కొందరైతే సబ్‌ కాంట్రాక్టులు పొంది జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రిగా శిద్దా రాఘవరావుపైనా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలు, కొండపి, కనిగిరి, ఎస్‌ఎన్‌పాడు, దర్శి తదితర ప్రాంతాలలో వచ్చిన రహదారుల పనుల్లో రాజకీయాలు చోటు చేసుకోవడంతో పాటు భారీగా పర్సంటేజీలు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని రహదారులు, హైవే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు ప్రభలంగా ఉన్నాయి.

ఆదిలోనే వదిలేసిన నివేదికలు..
హైవే ప్రాజెక్టులు రాబోతున్నాయని యంత్రాంగాన్ని హడావుడి చేశారు. చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్సులను పెట్టడం, భూసేకరణపై హడావుడి చేయడం చూసిన జనానికి ఇక హైవే ప్రాజెక్టులు వెంటనే రానున్నాయని, కష్టాలు తీరనున్నాయని భావించారు. ఇదంతా పాలపొంగేనని గమనించిన ప్రజలు టీడీపీ ప్రభుత్వంలోని పాలకుల మోసాన్ని గ్రహించారు.
దోర్నాల వద్ద టి జంక్షన్‌ ఆవశ్యకత ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 8 మండలాలు, 20 గ్రామాల్లో 172 ఎకరాలను సేకరించాలి. 19  గ్రామాల్లో భూసేకరణకు అవార్డు పాస్‌ చేశారు. ఇందు కోసం రూ.35.74 కోట్లు కేటాయించారు. కనిగిరిలో కొందరు హైకోర్టులో పిటీషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ ఇటీవలే పరిష్కారం అయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇక నష్ట పరిహారం చెల్లింపులకు చర్యలు తీసుకోవాలి.
ఒంగోలు–చీరాల ఎన్‌హెచ్‌లో 57.87 ఎకరాలను సేకరించాలి. ఆరు మండలాలు 14 గ్రామాల్లో విస్తరించి ఉంది. రూ.74.13 కోట్లు కేటాయించారు. చదలవాడతో పాటు వివిధ ప్రాంతాలలో రైతులు రోడ్డు అలైన్‌మెంట్‌పై ఆక్షేపించారు. పంచాయతీ చెరువును ఆక్రమించి రోడ్డు వేస్తున్నారని అడ్డగించారు. ఈ వివాదం నడుస్తోంది.
గిద్దలూరు–గుంటూరు సెక్షన్‌లో 9 మండలాలు 36 గ్రామాల్లో భూసేకరణ చేయాలి. 192.25 ఎకరాలు భూమి సేకరించాలి. ఇందులో సర్వే జరిగింది. నష్ట పరిహారం విడుదల కావాల్సి ఉంది.
అనంతపురం–గిద్దలూరు సెక్షన్‌ మూడు గ్రామాలలో భూసేకరణ చేయాలి. 25.71 హెక్టార్ల  భూమిలో సర్వేలో చేశారు. దీనికి 3–జి నోటిఫికేషన్‌ ఇచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.
కర్నూలు–దోర్నాల సెక్షన్‌లో ఎన్‌హెచ్‌ అభివృద్ధి పనులకు రూ.222.12 కోట్లు అంచనా వేశారు. దోర్నాలలో మూడు గ్రామాలను కవర్‌ చేయాలి. నవంబర్‌లో 3–జి నోటిఫికేషన్‌ ఇచ్చారు.
పూరిమిట్ల–సీఎస్‌పురం వయా సీతారాంపురం హైవే 296.991 ఎకరాలను సేకరించాలి. 4 మండలాలు 32 గ్రామాల్లో సేకరించాలి. సర్వే నివేదికలు తయారవుతున్నట్లుగా చెబుతున్నారు. కడప ఎన్‌హెచ్‌ ఈఈ పరిశీలనలో ఉంది.
అమరావతి ఎక్స్‌ప్రెస్‌ పరిధిలో 1739.65 ఎకరాలు ప్రతిపాదించారు. 12 మండలాల్లో 45 గ్రామాల్లో సర్వే చేశారు. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఆర్డీవోల నుంచి ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.
గిద్దలూరు–హైదరాబాద్‌ హైవే  సర్వే పనులు ఇంకా ముందుకు పోలేదు.

నిధుల కేటాయింపు లేదు.
ఆర్భాటంగా హైవే ప్రాజెక్టు ప్రతిపాదనలు చేసినా ఈ పనులకు నయాపైసా కేటాయించ లేదు. దోర్నాల వద్ద టి జంక్షన్‌ కోసం మాత్రమే నిధులు కేటాయించినా ఇందులోను పరిహారం ఇంకా ఇవ్వలేదు. దీంతో అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే కలగానే మిగిలింది.  

ఆర్భాటపు ప్రకటనలు..
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను కలుపుతు జిల్లాలోని రహదారులను అనుసంధానం చేస్తూ రకరకాల ప్రతిపాదనలను చేశారు. వాటిని ఆర్భాటంగా ప్రకటించారు. నయాపైసా ఇవ్వకుండా, హైవే ప్రాజెక్టులను ప్రకటించిన ఘతన చంద్రబాబుదే అన్న విమర్శలు వచ్చాయి. జిల్లా ప్రధాన రహదారులను హైవే ప్రాజెక్టుల పరి«ధిలో కలపాలని ప్రతిపాదించారు. రెండేళ్ల పాటు సమీక్షలు, సర్వేలు, నివేదికలపై హడావుడి చేశారు. తీరా ఎన్నికల కోసంగా ఇవన్నీ చేస్తున్నామని ప్రజల్లో విపరీతంగా ప్రచారం చేశారు. ఒక్క సారిగా ప్రజల కలల సౌధాన్ని కూలగొట్టారు. దావులపల్లి–దోర్నాల టి జంక్షన్‌ ప్రతిపాదించారు. చీరాల–ఒంగోలు, గిద్దలూరు–గుంటూరు సెక్షన్, అనంతపురం–గిద్దలూరు సెక్షన్, కర్నూలు–దోర్నాల సెక్షన్,  పోరుమామిళ్ల– సీఎస్‌ పురం వయా సీతారాంపురం, తిరిగి సీఎస్‌పురం–సింగరాయకొండ వయా పామూరు, కందుకూరు రోడ్డు, అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే, గిద్దలూరు–హైదరాబాద్‌ హైవే ప్రాజెక్టును ప్రతిపాదించారు.

ఇవన్నీ నిజంగానే చిత్తశుద్ధితో చేస్తే జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రధాన నగరాలకు అనుసంధానంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు ప్రయాణం సులువుగా, సౌకర్యవంతగా మారుతుంది. సరకు రవాణాలో వేగం పెరిగి వ్యాపార రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఇవన్నీ కాగితాలకే పరిమితం చేశారన్న ఆరోపణలు  ఉన్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ హైవే ప్రాజెక్టులను రూపొందించారన్న విమర్శలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement