నదీతీర నగరంలో మరోసారి నవరసాల వరద మొదలైంది. ఏడేళ్ల క్రితం రంగస్థల మహాపర్వానికి వేదికైన
నదీతీర నగరంలో మరోసారి నవరసాల వరద మొదలైంది. ఏడేళ్ల క్రితం రంగస్థల మహాపర్వానికి వేదికైన ఆనం కళాకేంద్రం మళ్లీ ఆ పండుగ కళతో తుళ్లిపడుతోంది. పలు కారణాలతో వాయిదా పడ్డ 2013, 2014 సంవత్సరాల నంది నాటకోత్సవాలు ప్రారంభమయ్యూయి. 16 రోజుల పాటు 85 ప్రదర్శనలతో వేలమంది కళాకారులు కళాప్రియులకు విందు చేయనున్నారు.
రాజమండ్రి :‘సాంస్కృతిక రాజధాని’గా మన్నన పొందే రాజమండ్రిలో పదహారురోజుల కళాపర్వానికి తెరలేచింది. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 16 రోజులు జరిగే 2013, 2014 నంది నాటకోత్సవాలు స్థానిక శ్రీ వేంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో శనివారం ప్రారంభమయ్యయి. ‘వీరాభిమన్యు’ పద్యనాటకంతో ప్రారంభమైన ఈ వేడుకలో తొలిరోజు మరో మూడు సాంఘిక నాటక, నాటికలు ప్రదర్శితమయ్యూయి. ప్రారంభోత్సవ కార్యక్రమం ఆలస్యం కావడంతో ఉదయం మొదలు కావాల్సిన నాటకాల ప్రదర్శనలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆరంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులు హాజరు కావాల్సిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాలేదు. దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మాగ ంటి మురళీమోహన్ వేడుకను లాంఛనంగా ఆరంభించారు.
ఆశించిన స్థాయిలో రాని ప్రేక్షకులు
2008లో రాజమండ్రిలో తొలిసారి నంది నాటకోత్సవాలను నిర్వహించారు. ప్రస్తుతం ఆధునికీకరించిన ఆనం కళాకేంద్రంలో రెండు సంవత్సరాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కాగా తొలిరోజు ప్రదర్శనలలో అడుగడుగునా ఆధునికత ఉట్టిపడింది. కళాకేంద్రాన్ని సెంట్రలైజ్డ్ ఏసీ చేయడంతో చల్లని వాతావరణంలో ప్రేక్షకులు నాటకాన్ని వీక్షించారు. తొలి రోజు నాటకాలు, నాటికల ప్రదర్శనకు ప్రేక్షకులు బాగానే వచ్చినా నిర్వాహకులు ఆశించిన స్థాయిలో లేరనే చెప్పాలి. కళాకేంద్రం వెలుపలు భారీ ఎల్‌సీడీ తెరలు ఏర్పాటు చేసినా అక్కడ సౌండ్ సిస్టం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. నంది నాటకోత్సవానికి సంబంధించి బ్రోచర్లను వేదిక మీద విడుదల చేసే వరకు ఇవ్వకపోవడం గమనార్హం. తొలి నుంచీ మన రాష్ట్ర పరిధిలోని నాటక సమాజాలు మాత్రమే ప్రదర్శనలు ఇస్తాయని నిర్వాహకులు చెప్పుకుంటూ వచ్చినా తెలంగాణా ప్రాంత నాటక సమాజాలు కూడా రావడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి సమాజాలు నాటక ప్రదర్శనలకు వచ్చాయి. తొలి రోజు ప్రదర్శనల్లో సుమారు 100 మంది నటీనటులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలకు వేదికైన ఎన్టీఆర్ కళా ప్రాంగణ రంగురంగుల విద్యుత్‌దీపాలు వెలుగులు, సెట్టింగ్‌లతో ప్రేక్షకులను మైమరిపించింది. సెట్టింగ్‌లు ప్రదర్శనలకు సహజత్వాన్ని సంతరించాయి.
లోపాలున్నా ప్రారంభం ఘనమే..
తొలి రోజు ప్రదర్శించిన ‘వీరాభిమన్యు, ఇది ప్రశ్న.. ఏది జవాబు?, హంస కదా నా పడవ, దొంగలు’ నాటక, నాటికలు ప్రేక్షకులను రంజింప చేశాయి. నటుల ప్రతిభ పరాకాష్టకు చేరిన సన్నివేశాల్లో ప్రేక్షకుల కరతాళధ్వనులు మార్మోగారుు. చిన్నాచితకా సమస్యలు, లోపాలు ఉన్నా మొత్తం మీద నంది పండుగ రాజమండ్రిలో మరో బృహత్ సాంస్కృతిక ఘట్టంగా అట్టహాసంగా ప్రారంభమైందనే చెప్పాలి.