హౌస్‌ఫుల్ | nandi natakotsavam | Sakshi
Sakshi News home page

హౌస్‌ఫుల్

May 22 2015 1:28 AM | Updated on Sep 3 2017 2:27 AM

రాజమండ్రిలో ఈనెల 16 నుంచి నంది నాటకోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఆరు రోజులు గా సాగుతున్న నంది నాటకాలు

 రాజమండ్రి :రాజమండ్రిలో ఈనెల 16 నుంచి నంది నాటకోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఆరు రోజులు గా సాగుతున్న నంది నాటకాలు జనరంజకంగా సాగుతున్నాయి. తొలి రెండు రోజులతో పోల్చుకుంటే అనంతరం నాటకాలకు ప్రేక్షకాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. నిర్వాహకులు ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రేక్షకులు నాటకాలను తిలకిస్తున్నారు. పద్య నాటకం, సాంఘిక నాటకం, నాటిక ఏదైనా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తిలకిస్తున్నారు. సందేశాత్మకంగా, ఉత్కంఠభరితంగా సాగుతున్న నాటకాలు వారిని కట్టిపడేస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల నుంచి ప్రముఖ నాటక సమాజాల నాటక, నాటికలు, వాటిలోని నటుల ప్రతిభాపాటవాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చిన్నపిల్లలు చేస్తున్న లఘునాటికలు సైతం ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తుండడంతో ఆనం కళాకేంద్రం కిక్కిరిసిపోతోంది. ఉదయం తొలి పద్య నాటకం నుంచి రాత్రి నాటకాలు ముగిసేవరకు వీక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఆరవరోజు గురువారం మండుటెండలో సైతం నాటకం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
 
 వృద్ధులు, మహిళలు, యువతీయువకులు, చిన్నపిల్లలు.. ఇలా అన్నివర్గాల వారు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. చిన్నపిల్లలను చంకనబెట్టుకుని తల్లులు తరలివస్తున్నారు. ఆనం కళాకేంద్రాన్ని సెంట్రల్ ఏసీ చేయడం వల్ల కూడా ప్రేక్షక హాజరు ఎక్కువగా ఉంటోంది. మధ్యాహ్న సమయంలో ప్రదర్శిస్తున్న సాంఘిక నాటకాల సమయంలో కుర్చీలు సరిపోక చాలా మంది నిల్చునే నాటకాలను వీక్షిస్తున్నారు. సాయంత్రం వేళల్లో కళాకేంద్రం బయట ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తెరల వద్ద ప్రేక్షకులు పెద్ద ఎత్తున చేరుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో కూడా ప్రేక్షకులు తమ కుర్చీలను అంటిపెట్టుకుని ఉండిపోతున్నారు. బయటకు వెళితే సీట్లను ఆక్రమించేస్తారని కర్చీఫ్‌లు, ప్లాస్టిక్ సంచులతో రిజర్వ్ చేసుకుంటున్నారు. కొందరు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుని అక్కడే భోజనాలు కానిచ్చేస్తున్నారు. ముందుముందు హాజరు మరింత పెరిగే అవకాశముందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
 
 30తోనే ముగియనున్న వేడుక
 నంది నాటకోత్సవాల్లో నాటకాల ప్రదర్శన ముందు నిర్ణరుుంచిన ప్రకారం ఈనెల 31 వరకూ జరగాలి. ఆ మర్నాడు బహుమతీ ప్రదానం జరగాలి. అయితే జూన్ ఒకటిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున నాటక ప్రదర్శనలను 30వ తేదీతో ముగించనున్నారు. అదేరోజు బహుమతీ ప్రదానం జరుగుతుంది. సమయం తగ్గడంతో ఇకపై ప్రతీ రోజూ ఆరు ప్రదర్శనలు జరగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement