సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది.
విజయనగరం మున్సిపాలిటీ:సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఏడు రోజులుగా సమ్మె చేపడుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో వినూత్న పద్ధతుల్లో వారు నిరసనలు తెలుపుతున్నారు. వీరి ఆం దోళనతో మున్సిపాలిటీలన్నీ మురికిమయంగా మారుతున్నాయి. శుక్రవారం నుంచి మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్‌లు, హెల్త్ అసిస్టెంట్‌లు, కంప్యూటర్ ఆపరేటర్‌లు సమ్మె బాట పట్టనున్నారు. ఈమేరకు గు రువారం సాయంత్రం విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల రిలే దీక్షలు మూడో రోజు గురువారం కొనసాగాయి. కార్మికుల దీక్షలకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభూజితో పాటు జిల్లా పింఛన్‌దారుల సంఘం ప్రతినిధి పెద్దింటి అప్పారావు తదితరులు సంఘీభావం తెలిపారు. బొబ్బిలిలో ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. సాలూరులో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.