బాలయ్య ఇంటి వద్ద దబిడి.. దిబిడి

Municipal sanitation workers Protest Infront of Blakrishna Home - Sakshi

ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసాన్ని ముట్టడించిన పారిశుద్ధ్య కార్మికులు

జీఓ 279 రద్దు చేయాలంటూ ఇంట్లోకి దూసుకెళ్లి చెత్త పడేసి నిరసన

తొలగించిన 220 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు

హిందూపురం అర్బన్‌: మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వం కార్మికులు పొట్ట కొడుతున్నా ఆయన ఎందుకు స్పందించడం లేదంటూ ఇంట్లోకి దూసుకెళ్లి చెత్తాచెదారాన్ని, మురుగును అక్కడ పడేసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఓ 279 తమ భవిష్యత్తును కాలరాస్తోందని, పాలకులు తమ నోటికాడ కూడు లాగేసి కాంట్రాక్టర్లకు వడ్డించాలని చూస్తున్నారని నాలుగు రోజులుగా వారు మున్సిపల్‌ ఆఫీసు ఎదుట నిరసన దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. పైగా మున్సిపల్‌ అధికారులు దీక్షలు చేస్తున్న 220 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంతో పారిశుద్ధ్య కార్మికుల కడుపు రగిలిపోయింది. ఈ నేపథ్యంలో వారు సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామునే తరలివెళ్లి బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. గేటు ముందు నిల్చుని నినాదాలు చేసినా ఎమ్మెల్యే పీఏ వీరయ్య, కో–ఆర్డినేటర్‌ శ్రీనివాసరావు బయటకు రాలేదు.

దీంతో వెంట తీసుకొచ్చిన చెత్తసంచులను ఇంట్లో పారబోశారు. ఇంతలో విషయం తెలుసుకున్న సీఐలు చిన్నగోవిందు, తమీంఅహ్మద్‌ సిబ్బందితో తరలివచ్చి వారిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాటలతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు కార్మికులను ఈడ్చి పడేశారు. ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న జిల్లా నాయకులు వెంకటేష్, రాజప్ప, రాములను పోలీసులు అదుపులోకి తీసుకుని జీపులో స్టేషన్‌కు తరలించడానికి ప్రయత్నించారు. అయితే కార్మికులు తమపై నుంచి తీసుకెళ్లండి అంటూ జీపులను అడ్డంగా పడుకున్నారు. పోలీసులు వారిని లాగేసి నాయకులను వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వాగ్వాదాలు, తోపులాటలతో అక్కడి వాతావరణం రణరంగంగా మారింది. ఈ తోపులాటలో కార్మికురాలు నాగమ్మ ఛాతీకి బలమైన దెబ్బ తగలడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తీసుకెళ్లారు.

ఏళ్ల తరబడి పనిచేస్తుంటే అన్యాయంగా తొలగిస్తారా..?
ఈ సందర్భంగా కార్మికులు, నాయకులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి రాత్రింబవళ్లూ పారిశుద్ధ్య పనులు చేస్తుంటే రెగ్యులర్‌ చేయలేదన్నారు. 279జీఓ తెచ్చి తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయడానికి సిద్ధమైందంటూ టీడీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఆ జీఓను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత నెలలో సుమారు 15రోజులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తే దిగి వచ్చిన ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగిస్తామని చెప్పినప్పటికీ ఎక్కడా లేని విధంగా హిందూపురం మున్సిపాల్టీలో మాత్రం ఆ జీఓను అమలు చేస్తున్నారని, జియో ట్యాగింగ్, ఇతర నిబంధనలు ప్రవేశపెడుతూ వేదనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇది అన్యాయమని నాలుగు రోజులుగా సమ్మె చేస్తుంటే 220 మంది కార్మికులను తొలగిస్తున్నామని చెప్పడం దుర్మార్గమన్నారు. వెంటనే జీఓ 279ను రద్దు చేసి, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఇంత దౌర్భగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన ఇటువైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. ఆయన హిందూపురం వస్తున్నాడంటే తాము రాత్రింబవళ్లూ పట్టణాన్ని శుభ్రం చేస్తున్నామని, కానీ ఆయన తమ గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ప్రభుత్వం తమపై కక్షగట్టి వ్యవహరిస్తోందని, పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని విచారం వెలిబుచ్చారు. రెండు నెలల నుంచి ఈ ప్రాంతంలో వినూత్నరీతిలో నిరసనలు తెలియజేస్తున్నా ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం మాటమాత్రానికైనా ఈ విషయం గురించి మాట్లాడకపోవడం తమ దౌర్భగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

165 మంది కార్మికులు అరెస్టు
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించడంతో వన్‌టౌన్‌ పోలీçసులు 166 మంది కార్మికులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వారిపై  151 సీఆర్‌పీసీ ప్రకారం కేసులు నమోదు చేశారు. తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదలివేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top