
కేశినేని నానికి ఎంపీ సీటు హుళక్కేనా!?
చంద్రబాబునాయుడు యూజ్ అండ్ త్రో పాలసీకి మరో సీనియర్ నేత బలికానున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విజయవాడ ఎంపీ సీటు ఇస్తానంటూ ట్రాన్స్‌పోర్టర్ కేశినేని శ్రీనివాస్
- రేసులో పారిశ్రామికవేత్త, విద్యావేత్త, ఎన్.ఆర్.ఐ.
- రంగంలోకి దిగిన పవన్‌కల్యాణ్
- నానికి తూర్పు సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం
- ప్రత్యామ్నాయంపై కేశినేని దృష్టి
సాక్షి, విజయవాడ : చంద్రబాబునాయుడు యూజ్ అండ్ త్రో పాలసీకి మరో సీనియర్ నేత బలికానున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విజయవాడ ఎంపీ సీటు ఇస్తానంటూ ట్రాన్స్‌పోర్టర్ కేశినేని శ్రీనివాస్ (నాని)ని మభ్యపెట్టి పార్టీ కోసం కోట్లు ఖర్చుపెట్టించారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి పారిశ్రామికవేత్తలంతా టీడీపీ టికెట్ల కోసం ఎగబడడంతో నానిని కరివేపాకులా పక్కన పడేశారు.
కోట్లాది రూపాయల సూట్‌కేసులు తీసుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు టికెట్ ఇచ్చేందుకు బాబు సిద్ధమయ్యారు. అయితే ఎంపీ సీటుకోసం పోటీపడుతున్న పి.వి.పి.ప్రసాద్, కోనేరు సత్యనారాయణకు ఇప్పటివరకు టీడీపీలో సభ్యత్వం లేకపోవడం విశేషం. ఆదివారం కేశినేని నాని హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి చంద్రబాబును కలిసి సీటు తనకే ఇవ్వాలని మరోసారి కోరారు.
ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నందున తనకే విజయావకాశాలు ఉన్నట్లు వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా గత ఏడాది మార్చి 16న చంద్రబాబు తనకు ఇచ్చిన హామీని ఆయనకే గుర్తుచేశారని తెలిసింది. ఒకవేళ సీటు ఇవ్వనిపక్షంలో ధిక్కారస్వరం వినిపించే అవకాశాలున్నాయి. కాగా విజయవాడ తూర్పు, పెనమలూరు అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి తీసుకోవాలంటూ చంద్రబాబు నానికి ఆఫర్ చేసినట్లు సమాచారం.
కోట్లకు సీట్లు!
టీడీపీలో విజయవాడ ఎంపీ సీటు కోట్లు పలుకుతోంది. ఎన్.ఆర్.ఐ. కోమటి జయరాం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమేనని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం చైర్మన్ కోనేరు సత్యనారాయణ అదే బాటలో ఉన్నారు. పారిశ్రామికవేత్త పొట్లూరు వరప్రసాద్ నిధులకు వెనుకాడకుండా ఖర్చుచేస్తానని చెప్పడంతోపాటు సినీనటుడు పవన్‌కల్యాణ్‌తో సిఫారసు చేయించారు. వరప్రసాద్‌కు సీటిస్తే కోస్తా జిల్లాల్లో బీజేపీ, టీడీపీ తరఫున ప్రచారం చేస్తానని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేశినేని నానిని పక్కన పెట్టి పై ఇద్దరిలో ఒకరికి సీటు ఇవ్వాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.
పాదయాత్ర నుంచి ఖర్చులన్నీ కేశినేనివే..
చంద్రబాబు కృష్ణాజిల్లాలో పాదయాత్ర నిర్వహించే సమయానికి పార్టీలో డబ్బు ఖర్చుచేసేందుకు ఏ నాయకుడు ముందుకురాలేదు. అప్పట్లో పార్టీలో సాధారణ నేతగా ఉన్న కేశినేనిని తెరపైకి తీసుకువచ్చారు. విజయవాడ పార్లమెంట్ సీటు ఆయనకే ఇస్తారంటూ ప్రచారం జరగడంతో జిల్లాలో పాదయాత్రకోసం సుమారు రూ.3 కోట్లు ఆయనతో ఖర్చు చేయించారు. పాదయాత్ర ముగింపు సభ విశాఖపట్నంలో జరిగితే దానికి కృష్ణాజిల్లాతోపాటు పక్క జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించే బాధ్యత కేశినేనికే చంద్రబాబు అప్ప జెప్పారు.
ఉత్తరాఖండ్‌లో వరదల్లో చిక్కుకున్నవారిని రక్షిస్తున్నట్లు చంద్రబాబు హంగామా చేయగా, హైదరాబాద్ విమానాశ్రయానికి తరలివచ్చిన బాధితుల్ని వారివారి సొంత జిల్లాలకు నాని కేశినేని ట్రావెల్స్ బస్సుల్లోనే పంపారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తరువాత చంద్రబాబునాయుడుపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో జరిగిన బస్సుయాత్ర ఖర్చును, నిన్నమొన్నటి కార్పొరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖర్చులన్నింటికీ ఏటీఎంలా కేశినేని ఉపయోగపడ్డారు. ఇప్పుడు వాటిని పక్కనపెట్టి తాజాగా ఎన్ని కోట్లు ఇస్తావంటూ టీడీపీ పెద్దలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు ప్రశ్నించడంతో కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్వయంకృతాపరాధం కూడా కొంత..
కేశినేని నానికి సీటు రాకపోవడానికి ఆయన స్వయంకృతాపరాధం కూడా కొంత ఉంది. పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుతో ఏడాది కాలంగా కేశినేని శ్రీనివాస్‌కు పొసగడం లేదు. దీంతో నాని స్వయంగా పార్టీ కార్యాలయం నిర్వహించారు. ఆగ్రహించిన ఉమ ఎంపీ సీటుకు కొత్త నేతల్ని తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగానే తొలుత పి.వి.పి., ఆ తరువాత కోనేరు సత్యనారాయణ, తాజాగా కోమటి జయరాంలను చంద్రబాబు వద్దకు ఉమ తీసుకువెళ్లారు. కేశినేని కంటే వీరంతా ఏ విధంగా మెరుగైన అభ్యర్థులో వివరించగలిగారు. అలాగే బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన కాళేశ్వరీ ట్రావెల్స్ అధినేత రవితోనూ కేశినేని నాని తగవు పెట్టుకోవడంతో బాలకృష్ణ కూడా కేశినేని నానికి వ్యతిరేకంగా చంద్రబాబుకు సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు అభ్యర్థులు కూడా కేశినేని కాకుండా మరో పారిశ్రామికవేత్త తమకు అభ్యర్థిగా వస్తే మంచిదని చంద్రబాబుకు ఫోన్‌లో చెప్పారు.
కింకర్తవ్యం ?
గతంలో టీడీపీ, ఆ తరువాత పీఆర్పీ, తిరిగి టీడీపీలో పనిచేసినా కేశినేని నానికి ఎక్కడా తాను ఆశించిన సీటు దక్కలేదు. ఈసారి కూడా ఆయనకు మొండిచెయ్యే ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయినందున స్వతంత్రంగా పోటీ చేయడమా.. లేక చంద్రబాబు చెప్పినట్లు విని తూర్పు లేదా పెనమలూరు సీటు తీసుకుని పోటీచేయడమా? లేక మౌనంగా తెరమరుగవడమా? చంద్రబాబును కడిగేసి రాజకీయాల నుంచి తప్పుకోవడమా? అని కేశినేని ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఎంపీ సీటు తప్ప ఎమ్మెల్యే సీటు తీసుకునేందుకు ఏమాత్రం సుముఖంగా లేరని సమాచారం. కేశినేని నానికి సీటు లభించకపోతే ఆయన్ను నమ్ముకున్న జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా సీటు దక్కదని తెలుస్తోంది.
కేశినేనిపై పవన్ ఎఫెక్ట్
టీడీపీ తరఫున విజయవాడ ఎంపీ సీటు ఆశిస్తున్న నానిపై సినీనటుడు పవన్‌కల్యాణ్ ప్రభావం పడుతోంది. జనసేన పార్టీ పెట్టి బీజేపీకి మద్దతు ప్రకటించిన పవన్‌కల్యాణ్ తాజాగా విజయవాడ సీటు పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌కి కేటాయించాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. పీవీపీకి సీటు ఇస్తే పార్టీకి పవన్ కల్యాణ్ ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపడంతో చంద్రబాబు కూడా ఆయన వైపే మొగ్గుతున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్(నాని)కే సీటు దక్కుతుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఆయన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఎంపీ సీటు ఆశిస్తున్న కోనేరు సత్యనారాయణ, పీవీపీలు ఇంటర్నేషనల్ స్కామర్లు అంటూ కేశినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించడం పార్టీలో సంచలనం కలిగించింది. పీవీపీ లాంటి స్కామర్లకు పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వవద్దంటూ నాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్‌కు సూచనలు చేయడమంటే సుద్దులు నేర్పడమేనని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన సీటు తెచ్చుకున్నా అనుకూలంగా తాము పనిచేయబోమని వారు చెబుతున్నారు.