రాష్ట్రంలో అరాచక పాలన | MLA Roja blocking shame | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచక పాలన

Mar 19 2016 1:36 AM | Updated on Oct 29 2018 8:08 PM

రాష్ట్రంలో అరాచక పాలన - Sakshi

రాష్ట్రంలో అరాచక పాలన

రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ....

ఎమ్మెల్యే రోజాను  అడ్డుకోవడం సిగ్గుచేటు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర   కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి

 
పట్నంబజారు (గుంటూరు) : రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయమై అసెంబ్లీలో తాజాగా జరుగుతున్న దుష్పరిణామాలే అందుకు నిదర్శనమని మండి పడ్డారు. నగరి ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి రానీయకుండా అడ్డుకోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో  లాడ్జిసెంటర్‌లోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వానికి న్యాయవ్యవస్థ మీద కూడా గౌరవం లేకపోవడం సిగ్గుచేటన్నారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించేలా ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడం కచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా వ్యవహరిస్తే పతనం తప్పదన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తుంచుకోవాలన్నారు. లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ కోర్టు తీర్పు బేఖాతరు చేస్తున్న చంద్రబాబు సర్కార్‌కు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.   విద్యార్థి విభాగం  జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి కళంకం తెచ్చేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
 
 వినూత్న నిరసన
టీడీపీ ప్రభుత్వం న్యాయానికి సైతం సంకెళ్లు వేస్తుందన్న సంగతి ప్రజలకు తెలియజేసేలా జిల్లా లీగల్ విభాగం అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సంకెళ్లు వేసుకుని వినూత్న నిరసన నిర్వహించారు. న్యాయవాదుల చేతులకు సంకెళ్లు వేసి నడిరోడ్డుపై నడిపించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వినూత్న నిరసనను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు షేక్ జానీ, న్యాయవాదులు పేరేచర్ల శ్రీను, కోటిరెడ్డి, డాక్టర్ సి.హెచ్.రామకోటిరెడ్డి, బి.కిరణ్, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి రబ్బాని, జిల్లా ప్రధాన కార్యదర్శులు విఠల్, వినోద్, నగర ప్రధాన కార్యదర్శి సాయిగోపి, ఎస్సీసెల్ జిల్లా ప్రధాన  కార్యదర్శి బాజి, నగర యువజన నేతలు వలి, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement