breaking news
lella Appireddy
-
యువతకు తీరని ద్రోహం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పట్నంబజారు: యువతకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైత న్య ఆధ్వర్యంలో, డివిజన్ నేతలు సిహెచ్ గౌతమ్, బి. అశోక్, ఫణింద్రారెడ్డి నేతృత్వంలో అమరావతిరోడ్డులోని 42వ డివిజన్‌కు చెందిన యువజనులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. వారికి అప్పిరెడ్డి కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన చంద్రబాబు తీరా గద్దెనెక్కిన తరువాత ఏ ఒక్క హామీని అమలుజేయలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క సంక్షేమ కార్యక్రమమూ చేపట్టలేదని మండిపడ్డారు. ప్రజాధనం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రధాన బాధ్యత యువత, విద్యార్థులపై ఉందని చెప్పారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ హక్కుల కోసం పోరాడుతున్న వారిపై కేసులు నమోదు చేయడం హేయమైన చర్యన్నారు. విద్యార్థి వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తామని చెప్పారు. చంద్రబాబు సర్కార్‌పై రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 42వ డివిజన్ యువజన విభాగం అధ్యక్షుడిగా గౌతమ్‌ను, విద్యార్థి విభాగానికి అశోక్‌ను నియమించారు. పార్టీలో చేరిన వారిలో శశి, వెంకటరెడ్డి, టోని, సన్నీ, చింటు, సుభాని, సతీష్, సాగర్, ఫిలిఫ్ ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రబ్బానీ, జిల్లా కార్యదర్శులు వినోద్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
► ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడం సిగ్గుచేటు ► వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి పట్నంబజారు (గుంటూరు) : రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయమై అసెంబ్లీలో తాజాగా జరుగుతున్న దుష్పరిణామాలే అందుకు నిదర్శనమని మండి పడ్డారు. నగరి ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి రానీయకుండా అడ్డుకోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో లాడ్జిసెంటర్‌లోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వానికి న్యాయవ్యవస్థ మీద కూడా గౌరవం లేకపోవడం సిగ్గుచేటన్నారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించేలా ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడం కచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా వ్యవహరిస్తే పతనం తప్పదన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తుంచుకోవాలన్నారు. లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ కోర్టు తీర్పు బేఖాతరు చేస్తున్న చంద్రబాబు సర్కార్‌కు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి కళంకం తెచ్చేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వినూత్న నిరసన టీడీపీ ప్రభుత్వం న్యాయానికి సైతం సంకెళ్లు వేస్తుందన్న సంగతి ప్రజలకు తెలియజేసేలా జిల్లా లీగల్ విభాగం అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సంకెళ్లు వేసుకుని వినూత్న నిరసన నిర్వహించారు. న్యాయవాదుల చేతులకు సంకెళ్లు వేసి నడిరోడ్డుపై నడిపించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వినూత్న నిరసనను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు షేక్ జానీ, న్యాయవాదులు పేరేచర్ల శ్రీను, కోటిరెడ్డి, డాక్టర్ సి.హెచ్.రామకోటిరెడ్డి, బి.కిరణ్, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి రబ్బాని, జిల్లా ప్రధాన కార్యదర్శులు విఠల్, వినోద్, నగర ప్రధాన కార్యదర్శి సాయిగోపి, ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాజి, నగర యువజన నేతలు వలి, వంశీ తదితరులు పాల్గొన్నారు.


