సాగరతీరంలో తప్పిన పెనుప్రమాదం

Missed out of a major accident in the beach - Sakshi

అలల్లో కొట్టుకుపోయిన యువతి, చిన్నారి

ప్రాణాలకు తెగించి కాపాడిన మెరైన్‌ హోంగార్డు ఆనంద్‌రాజు

ఊపిరి పీల్చుకున్న జనం

సాక్షి, కోడూరు(అవనిగడ్డ): కార్తీకమాసాన్ని పురస్కరించుకుని హంసలదీవి సాగరతీరంలో పుణ్యస్నానం చేసేందుకు వచ్చిన ఇద్దరు పర్యాటకులకు శనివారం పెనుప్రమాదమే తప్పింది. సముద్ర అలల ఉధృతికి కొట్టుకుపోతున్న యువతి, చిన్నారిని పాలకాయతిప్ప మెరైన్‌ హోంగార్డు ప్రాణాలకు తెగించి కాపాడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్లితే.. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన మెరుగుమాల శీరిష, వీరిశెట్టి అంజలి, చిట్టిమొతు నందిని, మెరుగుమాల గీతాశ్రీ హంసలదీవి సాగర సంగమం వద్ద కార్తీకస్నానం చేసేందుకు అదే మండలానికి చెందిన లోమ వసంతరావు ఆటోలో వచ్చారు.  వీరంతా సముద్రంలో స్నానాలు చేసేందుకు దిగారు. ఉదయం 11.45గంటల సమయంలో సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసి పడడంతో వాటి ఉధృతికి యువతి నందినితో పాటు చిన్నారి గీతాశ్రీ సముద్రం లోపలికి కొట్టుకుపోయారు.

ఇది గమనించిన అంజలి, శీరిష  కేకలు వేయడంతో అక్కడే ఉన్న పాలకాయతిప్ప మెరైన్‌ స్టేషన్‌ హోంగార్డు ఆనంద్‌రాజు లైఫ్‌జాకెట్, రింగులు ధరించి హుటాహుటినా సముద్రంలోకి పరుగులు పెట్టాడు. తన ప్రాణాలకు తెగించి అలల మధ్య కొట్టుకుపోతున్న నందిని, గీతాశ్రీని ఒడ్డుకు చేర్చాడు. అయితే అప్పటికే సముద్ర నీరు తాగేయడంతో ఇద్దరు స్పృహ కోల్పోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

వెంటనే వారిని ఇసుకతిన్నెలపై పడుకోబెట్టి కడుపు నొక్కడంతో తాగిన నీరు మొత్తం కక్కేశారు. పది నిమిషాల తరువాత నందిని, గీతాశ్రీ లేచి కూర్చోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  ప్రథమ చికిత్స నిమిత్తం యువతి, చిన్నారిని కోడూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
                                                                                                                                                                 హోంగార్డు ఆనంద్‌రాజు 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top