కృష్ణానది వెంబడి గుంటూరు జిల్లా వైపు కరకట్టపై ఆక్రమణలు తొలగిస్తాం, భవిష్యత్తులో కొత్త నిర్మాణాలకు
కరకట్ట వెంబడి భవనాలు తొలగిస్తానంటూ ప్రగల్భాలు
ఆక్రమణల మధ్యనే సీఎం చంద్రబాబు నివాసం
ప్రస్తుతం ఆక్రమణల ఊసే ఎత్తని ఉమా...
విజయవాడ: కృష్ణానది వెంబడి గుంటూరు జిల్లా వైపు కరకట్టపై ఆక్రమణలు తొలగిస్తాం, భవిష్యత్తులో కొత్త నిర్మాణాలకు అనుమతించబోం’. నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.(గతేడాది డిసెంబర్ 31న మీడియా ప్రతినిధులతో చెప్పిన మాటలు) సరిగ్గా ఏడాది కిందట నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా ప్రతినిధులందర్ని తీసుకువెళ్లి నదీతీరంలో ఉన్న ఆక్రమణలు చూపించారు. అప్పటికప్పుడు కృష్టా డెల్టా సీఈ సుధాకర్‌కు ఫోన్ చేసి ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలంటూ ఆదేశించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఆక్రమణ మధ్యే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మంత్రి ఉమా ఈ ఆక్రమణల గురించి నోరేత్తే సాహసం చేయడం లేదు. మంత్రిగా ఆయనకు ఎదురైన తొలి చేదు అనుభవం.
ఆక్రమణ కట్టడాలన్ని మంత్రి ప్రకటన...
కృష్ణానది వెంబడి సుమారు 18 కిలోమీటర్లు మేర నిర్మించిన ఇస్కాన్ టెంపులు, గణపతి సచ్చిదానంద ఆశ్రమం, ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్, లింగమనేని గెస్ట్‌హౌస్, డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం, చిగురు భవనం తదితర కట్టడాలను బోటులోంచి పరిశీలించి, వాటి సమాచారం అధికారుల ద్వారా తెలుసుకుని అవన్నీ అక్రమ నిర్మాణాలే అని ప్రకటించారు. డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం ఆరు అంతస్తుల భవన సముదాయాలు ఐదు ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి ఇక్కడ తాత్కాలిక సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాత్కాలిక రాజధానికి కావాల్సిన భవనాలన్ని ఇక్కడే ఉన్నాయంటూ అభిప్రాయపడ్డారు. గుడిసెలకు అనుమతులు తీసుకుని నదిని ఆక్రమించి భవన సముదాయాలను నిర్మించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నెలరోజుల్లో ఆ భవనాలకు నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకుంటూ మంటూ ప్రగల్బాలు పలికారు.
ఎంపీ గోకరాజు గంగరాజు షాక్
మంత్రి ఉమాకు నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు గట్టి షాక్ ఇచ్చారు. కరకట్ట వెంబడి గంగరాజుకు ఉన్న 40 సెంట్ల స్థలాన్ని బీజేపీకి అనుబంధంగా నడుస్తున్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్‌ముఖర్జీ ట్రస్టుకు విరాళంగా ఇవ్వడమే కాకుండా ఈ ఏడాది జనవరి 23వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో అక్కడ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయించారు. మంత్రి ఉమా కుదేలయ్యారు.
సీఎం నివాసం అక్కడే
సర్వేనెంబర్ 271, 272లలో 1.31 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లింగమేని గెస్ట్‌హౌస్‌ను ముఖ్యమంత్రి తన నివాసంగా మార్చుకున్నారు. ఆయన కోసం గెస్ట్‌హౌస్ మొత్తాన్ని మార్చారు. కరకట్ట రోడ్డును ఆధునీకరించారు. మంత్రి ప్రకటించినట్లుగా నదీపరివాహ ప్రాంతంలో నిర్మించిన భవనాలు ఆక్రమణలు అయితే అందులో ముఖ్యమంత్రి ఎందుకు ఉంటున్నారనే ప్రశ్నకు మంత్రి ఉమా సమాధానం చెప్పరు. ఆ తరువాత పలుమార్లు విలేకరులు నదీతీరంలో ఆక్రమణలు గురించి ప్రస్తావించినప్పుడు ఆ అంశం సీఆర్‌డీఎ అధికారులు చూస్తున్నారంటూ ఉమా మాట దాటేవేయడానికే ప్రయత్నిస్తున్నారు.
కాల్వగట్ల ఆక్రమణలపైన నగరంలోని కాల్వగట్ల ఆక్రమణలను తొలగిస్తామంటూ మంత్రి ఉమా అప్పట్లో ప్రకటించారు. ఇరిగేషన్ అధికారులు పేదల ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో మంత్రి ఉమా తోకముడిచి.. పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చిన తరువాతనే తొలగిస్తామంటూ ఆ ప్రతిపాదనను విరమించు కున్నారు.