సీఎస్‌​ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మంత్రి అవంతి సమీక్ష

Minister Avanthi Srinivas Review Meeting With CS LV Subramanyam - Sakshi

బాల మురళీ కృష్ణ అవార్డు ప్రకటన

సంగీత విధ్వాంసురాలు బాంబే జయశ్రీ ఎంపిక

టూరిజంశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడి

సాక్షి, అమరావతి : టూరిజం, యూత్అ ఫైర్స్ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏయే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే దానిపై సీఎస్‌తో సమీక్షించామని తెలిపారు. 2019 ఏడాదికి గాను మంగళంపల్లి బాల మురళీ కృష్ణ అవార్డును కర్నాటక సంగీత విధ్వాంసురాలు బాంబే జయశ్రీకి అందజేయనున్నట్టు వెల్లడించారు. బహుమతి ప్రదాన కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెప్టెంబర్ 10న నిర్వహిస్తామని అన్నారు. రూ.10 లక్షల నగదు పురస్కారాన్ని అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త శిల్పారామాలకు పీపీపీ పద్ధతిలో భూమిని కేటాయిస్తామని స్పష్టం చేశారు. కడప, కర్నూలు జిల్లాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. నెలరోజుల్లో విజయవాడలో బాపు మ్యూజియం  ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

సాత్విక్‌ సాయిరాంను అభినందిస్తాం..
‘బ్యాడ్మింటన్‌లో పతకం సాధించిన  అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాంను  ముఖ్యమంత్రి సమక్షంలో  అభినందిస్తాం. ఇటీవల చనిపోయిన బ్యాడ్మింటన్‌ కోచ్ సుధాకర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. విశ్వ విద్యాలయాల్లో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలు, ట్రాక్స్  నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహకాలు అందిస్తాం. ప్రతి నెల ఒక జిల్లాలో క్రీడలు నిర్వహిస్తాం. ఆయా క్రీడల్లో గెలుపొందిన వారితో రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తాం.

గాయాల పాలైన, అనారోగ్యానికి గురైన  క్రీడాకారులకు చికిత్స చేయిస్తాం. దానికోసం ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో టూరిస్టుల కోసం  పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు  నిర్వహించే యోచనలో ఉన్నాం. తద్వారా అన్ని ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల సంప్రదాయం వెల్లి విరేసేలా కృషి చేస్తాం. పురాతన దేవాలయాలను దేవాదాయ లేక టూరిజం శాఖ ద్వారా అభివృద్ధి చేస్తాం’అని అవంతి చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top