అర్ధరాత్రులు ఇసుక అక్రమ రవాణా

Midnight Sand Smuggling In Krishna - Sakshi

కలెక్టర్‌ ఆదేశాలు లెక్కచేయని వైనం

యథేచ్ఛగా లారీల్లో     ఇసుక తరలింపు

చినఓగిరాల, ఉయ్యూరుల్లో పట్టివేత

వ్యాపారులకు ఎమ్మెల్యేలు వత్తాసు

కృష్ణాజిల్లా , ఉయ్యూరు (పెనమలూరు) : ఇసుక అక్రమ దందా ఆగడం లేదు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా వ్యాపారులు లారీల్లో అక్రమంగా ఇసుక తరలించేస్తూనే ఉన్నారు. రెండు రోజులుగా ఉయ్యూరు, పరిసర ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నా ఏ మాత్రం ఖాతరు చేయకుండా అర్థరాత్రులు ఇసుకను దారి మళ్లిస్తున్న వైనం చినఓగిరాల ఘటనలో వెలుగు చూసింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ వ్యాపారులకు మద్దతు పలుకుతూ చూసీచూడనట్టు వదిలేయాలని కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేల అండదండలు ఉండటంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అర్థరాత్రులు తరలింపు.. లారీ సీజ్‌..
తోట్లవల్లూరు మండలానికి చెందిన టీడీపీ నేత.. ఓ మాజీ సర్పంచ్‌ లారీలతో ఇసుక అక్రమ తరలింపునకు పాల్పడుతున్నాడు. రాత్రిళ్లు డంప్‌ చేసిన ఇసుకను లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాడు. తోట్లవల్లూరు నుంచి చినఓగిరాలకు వచ్చే రోడ్డులో ఇసుకను డంప్‌ చేసి రాత్రిళ్లు తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు మంగళవారం అర్థరాత్రి దాటాక దాడి చేశారు. ఆర్‌ఐ సుందర్రావు నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో ఇసుక లోడు లారీ పట్టుబడింది. అధికారులను చూసిన డ్రైవర్‌ లారీని వదిలి పరారయ్యాడు. ఇసుక ట్రాక్టర్లతో వస్తున్న ముగ్గురు డ్రైవర్లు అధికారుల దాడితో వాటిని వెనుతిప్పి జంప్‌ అయ్యారు. లారీని సీజ్‌ చేసి తహసీల్దార్‌ కార్యాలయానికి ఆర్‌ఐ తరలించారు. ఉయ్యూరు సమీపంలోని సౌభాగ్యనగర్‌ దగ్గర ఓ ఇసుక లోడు ట్రాక్టర్‌ను పట్టుకుని సీజ్‌ చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఆర్‌ఐ తెలిపారు.

అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండ..
ఇసుక అక్రమార్కుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉయ్యూరులో ఎనిమిది డంపింగ్‌ ప్రాంతాలను మైనింగ్, రెవెన్యూ అధికారులు గుర్తించారు. మంటాడలో రెండు ఇసుక లోడు లారీలను మంగళవారం రాత్రి సీజ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ అక్రమ ఇసుక రవాణాపై సీరియస్‌గా ఉన్నారు. లారీల్లో రవాణా చేపట్టినా, అర్థరాత్రి ఇసుక రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకపక్క అధికారులు దాడులు చేస్తూనే ఉన్నా మరో పక్క అక్రమార్కులు తమ పని కానిస్తూనే ఉన్నారు. అక్రమ ఇసుక వ్యాపారులపై వోల్టా చట్టం, క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ప్రకారం కఠిన చర్యలు చేపట్టకుండా జాప్యం చేయడం వల్లే ఈ దందా ఆపడం లేదని సమాచారం. కాగా, వ్యాపారులంతా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి కలెక్టర్‌పై ఒత్తిడి చేయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చూసీచూడనట్టు పోవాలని ఆ ప్రజా ప్రతినిధులు చెప్పడంతోనే అధికారులు వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top