13 మంది ఉపాధి సిబ్బంది సస్పెన్షన్‌

MGNREGA Scheme In Velugu Employees Are Suspended At Chittoor - Sakshi

10 మంది వెలుగు సిబ్బందిపై వేటు

ఎర్రావారిపాళెంలో వెలుగుచూసిన భారీ కుంభకోణం

అడిషనల్‌ పీడీ శ్రీనివాస్‌ ప్రసాద్‌ ఆగ్రహం

రూ.12.29లక్షల రికవరీకి ఆదేశం

సాక్షి, ఎర్రావారిపాళెం:  ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి ఎర్రావారిపాళెం మండలానికి చెందిన 13 మంది ఉపాధి హామీ సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ అడిషనల్‌ పీడీ శ్రీనివాస్‌ ప్రసాద్‌ సోమవారం ఆదేశాలిచ్చారు. మరోవైపు మామిడి చెట్లు లేకుండానే వెలుగు సిబ్బంది బిల్లులు చేసినట్లుగా గుర్తించి పది మందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.  సామాజిక తనిఖీల్లో భాగంగా మండల వ్యాప్తంగా జరిగిన 800 ఉపాధిహామీ పనుల్లో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. 2018–19 వార్షిక సంవత్సరానికి రూ.7.5కోట్ల మేర ఎర్రావారిపాళెం మండలంలో ఉపాధి నిధులు ఖర్చుచేశారు. ఈ పనులను తనిఖీ చేయడానికి పది రోజుల నుంచి మండలంలో ఎస్‌ఆర్‌పీ వెంకటేష్‌ నాయక్‌ సారధ్యంలో 12 మందితో కూడిన 12వ సామాజిక తనిఖీ బృందం పరిశీలించింది.

ఈ తనిఖీల్లో భారీ కుంభకోణాలు వెలుగుచూశాయి.ఉపాధిహామీ పథకంలో జరిగిన పలు అక్రమాలు, అవకతవకలను సోమవారం జరిగిన ఆడిట్‌ ఓపెన్‌ ఫాంలో బహిర్గతం చేశారు. పనులు లేకుండా బిల్లులు చేయడం, యంత్రాలతో పనులు చేసి కూలీల పేర్లతో బిల్లులు తీసుకున్నట్టు ఆడిట్‌ బృందం గుర్తించింది. పనుల వద్ద పనికి సంబంధించి వివరాలతో కూడిన బోర్డులు నిర్మించకపోవడం, ఎస్‌డబ్ల్యూపీసీ పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ బిల్లులు చేసినట్టు కనిపెట్టింది. నిర్దేశిత పనికి మంజూరైన బిల్లులకు మించి అదనంగా బిల్లులు చెల్లించినట్టు నిర్ధారిం చింది. అనేక పనులను యంత్రాలతో చేసినట్లు అధికారులు వెల్లడించారు. పనులకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించక పోగా గ్రామ సభ తీర్మానాలు ఒక్క పనికి ఇవ్వనట్లు పేర్కొన్నారు. ఫాం పాండ్లు, ఫీడర్‌ చానల్, ఫిష్‌ పాండు, పొలాలకు రోడ్డు పనుల్లో అవకతవకలు బయటపెట్టారు.
 
గతంలో సస్పెండైన వారివే అవకతవకలు
గత ఆడిట్‌లో సస్పెండ్‌ అయిన ఉపాధి సిబ్బందిని టీడీపీ ప్రభుత్వం మళ్లీ కొనసాగించడంతో అవే తప్పులు మళ్లీ పునరావృతం కావడం విశేషం. గత ఆడిట్‌లో ఆరుగురు సిబ్బంది సస్పెండ్‌ అయ్యారు. అయితే ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న టీడీపీ నాయకులు పంతం పట్టి అదే సిబ్బందిని ఒత్తిడి చేసి విధుల్లో కొనసాగించారు. అప్పట్లో కొనసాగిన ప్రతి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మళ్లీ అంతకు మించి తప్పులు చేసి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆరు నెలలు సస్పెన్షన్‌లో ఉన్న బీఎఫ్‌టీతో చెక్‌డ్యాంలకు ఏపీఓతో పాటు ఈసీలు సంతకాలు చేయించిన విషయాన్ని అడిషనల్‌ పీడీ గుర్తిం చారు. సస్పెన్షన్‌లో ఉండగా ఎలా సంతకాలు చేస్తారంటూ ఏపీఓను అడిషనల్‌ పీడీ ఆగ్రహించారు. తమ ప్రమేయం లేదు ఏపీడీ ఆదేశాల మేరకే అనుమతించామంటూ ఏపీఓ బదులిచ్చారు. అలానే రిపోర్ట్‌ ఇస్తే ఏపీడీని కూడా సస్పెండ్‌ చేస్తానంటూ సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అపరాధం, సస్పెన్షన్‌ వేటు
ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో అక్రమాలకు పాల్పడ్డ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. కమళ్ల, బోడేవాండ్లపల్లి, నెరబైలు, చెరుకువారిపల్లి, ఉస్తికాయలపెంట, యల్లమంద, వీఆర్‌ అగ్రహారం, ఉదయమాణిక్యం, కూరపర్తివారిపల్లి పంచాయతీలకు చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఏపీఓ, టీఏ, ఈసీ, బీఎఫ్‌టీలు మొత్తం 13 మందిని సస్పెండ్‌ చేశారు. అదేవిధంగా రూ.12.29 లక్షల రికవరీకి ఆదేశించారు. పనుల్లో జరిగిన కొలతలు, బిల్లులు మంజూరులో లోపాలు, తప్పుడు మస్టర్లు, బినామీ మస్టర్లు సృష్టించడం వంటివి తనిఖీల్లో బయటపడ్డాయి. చెరువులో పూడిక తీత పనులు, చెక్‌డ్యాంలో కొలతలు తేడా, చెక్‌డ్యాంలు రాళ్లతో కట్టినట్టు గుర్తించడం, అంగన్‌వాడీ వర్కర్ల పేర్లతో బిల్లులు చేసినట్లుగా గుర్తించారు.
 
పది మంది వెలుగు సిబ్బందిపై వేటు
మండలంలో పలుచోట్ల మామిడి చెట్లు లేకుండానే వెలుగు సిబ్బంది బిల్లులు చేసినట్లుగా గుర్తించారు. దీంతో పదిమందిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు. మరోవైపు యంత్రాలతో చేసిన పనులకు కూలీల పేర్లతో బిల్లులు తీసుకున్నట్లుగా ఆధారాలను ఆడిట్‌ బృందం బహిర్గతం చేసింది. చింతగుంట పంచాయతీలో అవకతవకలు జరిగాయంటూ ప్రజలు విన్నవించారు. అక్కడ చేసిన పనులన్నీ పూర్తిస్థాయిలో లేకపోగా పలు పనులను పాత వాటికే బిల్లులు చేశారంటూ అడిషనల్‌ పీడీకి ఫిర్యాదుచేశారు. చింతగుంటలో రీ ఆడిట్‌కు అడిషనల్‌ పీడీ శ్రీనివాస్‌ ప్రసాద్‌ ఆదేశాలిచ్చారు.
 
ముందే చెప్పిన సాక్షి
ఎర్రావారిపాళెం మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనుల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీనిపై సాక్షి దినపత్రిక పలు కథనాలను ప్రచురించింది. ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేతివాటం ప్రదర్శిస్తూ ప్రజాధనాన్ని స్వార్థపరులకు కమీషన్‌కు అమ్మేస్తున్నారంటూ పలు కథనాల్లో పేర్కొంది. సాక్షి చెప్పినట్లే సోమవారం జరిగిన బహిరంగ సభలో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top