
కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవియాను కలిసిన మేకపాటీ గౌతమ్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అందాల్సిన సహకారంపై కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవియాను బుధవారం ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. విభజన హామీలను కేంద్రమంత్రికి వివరించారు. అనంతరం గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దుగరాజపట్నం పోర్టును జాతీయ పోర్టుగా గుర్తించి ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల దృష్ట్యా ముందుకు సాగలేదని మంత్రికి తెలిపినట్లు వెల్లడించారు. కాగా ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాలను చూపించాలని కేంద్రం కోరిందని తెలిపారు. దీంతో రామాయపట్నం, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. బకింగ్ హామ్ కెనాల్‌లో జల రవాణా విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు గౌతమ్ రెడ్డి తెలిపారు.