పెదమానాపురంలో వైద్యశిబిరం

Medical Camp In Pedamanapuram  - Sakshi

సాక్షి కథనానికి స్పందన

దత్తిరాజేరు విజయనగరం : మండలంలోని పెదమానాపురం దళిత కాలనీలో సోమవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వారం రోజులుగా కాలనీవాసులు జ్వరాలతో అవస్థలు పడుతున్న నేపథ్యంలో ‘మంచం పట్టిన మానాపురం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి విజయలక్ష్మి ఆదేశాల మేరకు స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి రామేశ్వరి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి రోగులకు వైద్యసేవలందించారు. రాజన శాంతి, మరియాల వెంకటలక్ష్మి, బొత్స రమ, ఈశ్వరమ్మ, చిన్నారులు గౌతమి, నాని, మౌనిక, తదతర జ్వర పీడితులకు వైద్య పరీక్షలు నిర్వహించి  అవసరమైన మందులు అందజేశారు.

ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితుల వివరాలు సేకరించారు. అనంతరం డాక్టర్‌ రామేశ్వరి మాట్లాడుతూ, పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే జ్వరాలు ప్రబలినట్లు చెప్పారు. స్థానిక పశువుల ఆస్పత్రి ఆవరణలో పశువులను నిత్యం ఉంచడం వల్ల మురుగు పేరుకుపోవడంతో వ్యాధులు ప్రబలాయని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై జిల్లా పంచాయతీ అధికారి  బి. అప్పారావు ఆరా తీశారు.

పనులు సక్రమంగా చేపట్టాలని మండల పంచాయతీ అధికారి రాంబాబును ఆదేశించారు.  ఈ విషయమై గ్రామ ప్రత్యేక అధికారి, మండల తహసీల్దార్‌ కల్పవల్లి స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ సత్యనారాయణ, హెల్త్‌ సూపర్‌వైజర్‌ నరసింహులు, ఫార్మాసిస్టు సీతారాం, వీఆర్వోలు తిరుపతి, రాజేష్, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top