మూడేళ్లుగా నియామకాలు లేకపోవడం, పోటీ అధికమైన కారణంగా పీజీ వైద్య విద్యలో సీట్లు రాకపోవడం, జీవితంలో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలన్న ఆలోచనతో ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలపై మక్కువ చూపుతున్నారు.
సర్కారీ కొలువులకే ఎంబీబీఎస్‌ల మొగ్గు
Sep 16 2013 4:10 AM | Updated on Oct 16 2018 2:57 PM
సాక్షి, హైదరాబాద్ : మూడేళ్లుగా నియామకాలు లేకపోవడం, పోటీ అధికమైన కారణంగా పీజీ వైద్య విద్యలో సీట్లు రాకపోవడం, జీవితంలో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలన్న ఆలోచనతో ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలపై మక్కువ చూపుతున్నారు. ఇటీవల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు ప్రభుత్వం సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం వైద్యుల నుంచి వచ్చిన దరఖాస్తులు చూస్తే ఈ పోస్టులకు డిమాండ్ ఎంత ఉందో ఇట్టే తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,225 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకూ సుమారు 4 వేల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో వచ్చాయి.
దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 25 వరకూ గడువుండటంతో మరో 4 వేలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఎంబీబీఎస్ వైద్యుల కంటే దంతవైద్యుల పోస్టులకు మరింత డిమాండ్ ఏర్పడింది. మొత్తం 19 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఇప్పటి వరకూ1,200 దరఖాస్తులు వచ్చాయి. వీటికి మొత్తం ఐదువేలపైనే దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఒక్కో పోస్టుకు 260 మంది పైనే పోటీ పడుతున్నట్టు స్పష్టమవుతోంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు మాత్రం ఒక్కో పోస్టుకు 6 నుంచి 8 మంది పోటీ పడుతున్నారు.
మూడు అంశాలే ప్రాతిపదిక
2010 సంవత్సరంలో నిర్వహించిన వైద్యుల నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మూడు అంశాల ప్రాతిపదికన నియామకం చేయాలని నిర్ణయించారు. ఎంబీబీఎస్‌లో వచ్చిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వైద్యులకు 15 శాతం, ఎంబీబీఎస్ పాసైన సంవత్సరం ఆధారంగా సీనియారిటీకి 10 శాతం వెయిటేజీ ఇస్తారు. ఈ మూడు అంశాల్లో వచ్చిన వెయిటేజీ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ నియామకాల్లో ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. అక్టోబర్ 20 నాటికి నియామకాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి, 25వ తేదీకల్లా అర్హుల జాబితాను ప్రకటిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఈసారి నియామకాల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే భారతీయ వైద్య మండలి వైద్యులకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ధ్రువపత్రాలు పరిశీలన జరుగుతుందని వారు వెల్లడించారు.
Advertisement
Advertisement