రష్యాలో గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన భారతీయ MBBS విద్యార్థి కథ విషాదాంతమైంది. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన 22 అజిత్ సింగ్ చౌదరి మృతదేహం ఆనకట్టలో లభ్యమైంది. దీంతో బాధిత విద్యార్థి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
రష్యాలో దాదాపు మూడు వారాలుగా తప్పిపోయిన వైద్య విద్యార్థి అజిత్ సింగ్ చౌదరి మృతదేహాన్ని ఉఫా నగరంలోని ఆనకట్ట సమీపంలో గుర్తించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటన గురించి కుటుంబ సభ్యులకు , అల్వార్‌లోని స్థానిక ప్రతినిధులకు సమాచారం అందించింది.
అజిత్ సింగ్ చౌదరి 2023 నుండి రష్యాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో M ఎంబీబీఎస్ డిగ్రీ చదువుతున్నాడు. అక్టోబర్ 19న ఉదయం 11 గంటల ప్రాంతంలో తన హాస్టల్ నుండి బయటకు వచ్చిన తర్వాత అజిత్ అదృశ్యమయ్యాడు. పాలు కొనుక్కుని అరగంటలోపు తిరిగి వస్తానని స్నేహితులకు చెప్పి వెళ్లిన అతను ఎంతకీ తిరిగిరాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
స్థానిక అధికారులు వైట్ నది సమీపంలో అతని బట్టలు, ఫోన్ ,బూట్లు కనుగొన్నారు. పంతొమ్మిది రోజుల తరువాత, అదే నదికి ఆనుకుని ఉన్న ఆనకట్ట వద్ద అజిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.తోటి విద్యార్థులు మృతదేహాన్ని గుర్తించారు
పోస్ట్‌మార్టం అనంతరం అతని మృతదేహాన్ని ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాయబార కార్యాలయం, రష్యన్ అధికారుల మధ్య సమన్వయంతో స్వదేశానికి తిరిగి పంపే ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తి కావచ్చని అధికారులు తెలిపారు.
చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
అజిత్ అనుమానాస్పద మరణంతో అజిత్ తల్లిదండ్రులు రూప్ సింగ్ ,సాంత్రా దేవి శోకానికి అంతులేకుండా పోయింది. వైద్యవిద్య కోసం మూడెకరాల భూమి అమ్మినట్టు బంధువులు తెలిపారు. ఎన్నో కలలతో అజిత్‌ను విదేశాలకు పంపించాం, కానీ మనిషినే కోల్పోతామని అనుకోలేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రవుతున్నారు. ఎలా చనిపోయాడనే దానిపై వివరణాత్మక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు అజిత్ గ్రామస్తులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్ అదృశ్యం పట్ల త్వరగా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని మృతదేహాన్ని త్వరగా తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమ్యూనిటీ సభ్యులు అల్వార్ జాట్ హాస్టల్‌లో సమావేశం నిర్వహించారు.
దీనిపై కాంగ్రెస్ నాయకుడు జితేంద్ర సింగ్ అల్వార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏదో అనుమానాస్పదంగా అనిపిస్తోందంటూ ట్వీట్ చేశారు. మృతదేహాన్ని తరలించేలా ఏర్పాటు చేయాలనీ, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కోరారు.
ఇదీ చదవండి: Betting App Case: శిఖర్ ధావన్, రైనాపై సజ్జనార్ ఆగ్రహం


