సమాజంలో, ముఖ్యంగా సినీ సమాజంలో నటీ మణులు, హీరోయిన్లపై, శరీరాలపై అవమానకర (Bodyshaming) వ్యాఖ్యలు పరిపాటిగా మారిపోయాయి. తాజాగా తమిళ నటి గౌరీ కిషన్ (Gouri Kishan) శరీరాన్ని అవమానించేలా ఒక ప్రెస్‌మీట్‌లో అడిగిన ప్రశ్న ఆగ్రహ జ్వాలల్ని రగిలించింది.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ ఈవెంట్‌లో తన బరువు గురించి తమిళ యూట్యూబ్ మీడియా జర్నలిస్టు ‘మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు?’ అని అడిగిన ప్రశ్నకు గౌరీ కిషన్ తీవ్రంగా స్పందించింది. నటిగా నా నటన గురించి అడిగాలి, సినిమా గురించి అడగాలి కానీ, నా శరీర బరువు గురించి అడగడం ఏమిటంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ప్రశ్న ఒక పురుష నటుడి బరువు గురించి అడుగుతారా అని కూడా ఆమె ప్రశ్నించింది. పైగా బరువు గురించి అడిగిన ప్రశ్న కరెక్టే అని ఒక పురుష జర్నలిస్ట్ వాదించడం దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, ఇది జర్నలిజం కాదు. వేధింపులతో సమానమని పేర్కొంది. జర్నలిస్టులు వృత్తికి అవమానం తెస్తున్నారంటూ సీరియస్ అయ్యింది.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద నటికి మద్దతుగా నిలిచారు. మహిళలపై ఆబ్జెక్టిఫికేషన్, బాడీ షేమింగ్‌కు అడ్డుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. గౌరీ కిషన్ తన రాబోయే చిత్రం 'అదర్స్' కోసం చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగికత గురించి చర్చకు దారితీసింది. గౌరీ స్పందనతో అక్కడే వున్న ఆదిత్య మాధవన్ మౌనం కూడా ఈ చర్చకు ఆజ్యం పోసింది.
క్షమాపణలు కోరిన హీరో
అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరీ సహనటుడు, నటుడు ఆదిత్య మాధవన్ దీనిపై స్పందిస్తూ అందరికీ క్షమాపణలు చెప్పారు. తన మౌనం బాడీ షేమ్ చేయడాన్ని ఆమోదించినట్టుకాదనీ, కానీ ఆ సందర్భంలో స్తంభించి పోవడంతో తన నోట మాట రాలేదంటూ చెప్పుకొచ్చాడు. అయినా తాను జోక్యం చేసుకుని ఉండి ఉంటే బాగుండు అన్నారు.
చిన్మయి స్పందన
గాయని చిన్మయి శ్రీపాద ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు."గౌరీ అద్భుతమైన పని చేసింది. అగౌరవకరమైన, అనవసరమైన ప్రశ్న అడిగిన క్షణం, అరుపులు, ఎదురుదెబ్బలు వినిపిస్తాయి. ఇంత చిన్న వయస్సులో ఇంత ధైర్యంగా నిలబడినందుకు చాలా గర్వంగా ఉంది. ఏ పురుష నటుడిని కూడా బరువు గురించి అడగరు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.
అటు పలువురు మహిళా జర్నలిస్టులు, పలువురు నెటిజన్లు గౌరీ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. హీరో, దర్శకుడు అక్కడే ఉండి కూడా మౌనంగా ఉండటం ఇద్దరికీ సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాగా బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గౌరీ కిషన్ తనదైన నటన, ప్రతిభతో హీరోయిన్‌గా రాణిస్తోంది తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Thank you @Chinmayi
Women like you inspire us to stand our ground.
Your support means a lot to me, thank you. https://t.co/SbfN3eCyEp— Gouri G Kishan (@Gourayy) November 6, 2025


