
దేవరపల్లి–గోపాలపురం రోడ్డులో ఫ్లైఓవర్‌ను పరిశీలిస్తున్న ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
సాక్షి, దేవరపల్లి: 2020 డిసెంబరు నాటికి గుండుగొలను–కొవ్వూరు జాతీయరహదారి నిర్మాణం పూర్తవుతుందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ తెలిపారు. దేవరపల్లి–గోపాలపురం మధ్య జరుగుతున్న రహదారి విస్తరణ పనులు, ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని సోమవారం ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావులు పరిశీలించారు. ఈ సందర్భంగా భరత్‌రామ్ మాట్లాడుతూ 2020 డిసెంబరు 31 నాటికి రోడ్డు విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు. రోడ్డు నిర్మాణంపై ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. మంత్రి ఇచ్చిన సమాధాన పత్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి అందజేసినట్టు చెప్పారు.
గుండుగొలను– కొవ్వూరు మధ్య సుమారు 70 కిలోమీటర్లు నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నట్టు ఆయన తెలిపారు. 70 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 28 ఫ్లై ఓవర్ వంతెనల్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రహదారి నిర్మాణం 25 శాతం పూర్తయిందని వివరించారు. పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ భరత్‌రామ్ అధికారులకు సూచించారు. గుండుగొలను–కొవ్వూరు వరకు గల ప్రస్తుత రోడ్డును అధికారులు సర్వే చేశారని, రోడ్డు అధ్వానంగా ఉన్నందున నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.
తల్లాడ–దేవరపల్లి రోడ్డు మరమ్మతులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి నిధులు మంజూరుకు కృషచేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ గోపాలపురం నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ భరత్‌రామ్‌ను కోరారు. కార్యక్రమంలో జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.కె దుర్గారావు, నరహరిశెట్టి రాజేంద్రబాబు, మండల పార్టీ అధ్యక్షులు కూచిపూడి సతీష్, నాయకులు పాల్గొన్నారు.