రోగాలు కొనుక్కోకండి!


మాధుర్యాన్ని పంచి.. ఆరోగ్యాన్నిచ్చే మామిడి పండ్లు విషతుల్యమవుతున్నాయి. పక్వానికి వచ్చిన మామిడి కాయలను గడ్డిలో మాగబెట్టాల్సిన వ్యాపారులు త్వరితగతిన సొమ్ము చేసుకోవడానికి రసాయనాలు చల్లి మగ్గిస్తున్నారు. మధురమైన మామిడి పండ్లను విషపూరితం చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇవన్నీ పెద్దగా పట్టించుకోని జనం రోగాలను ‘కొని’ తెచ్చుకుంటున్నారు.

 

 సాక్షి, అనంతపురం డెస్క్ : మామిడి పండ్ల వ్యాపారుల కక్కుర్తికి ‘అనంత’ ప్రజానీకం బలవుతున్నారు. రుచిలో రారాజుగా పేరుగాంచిన మామిడి పండు పసుపు పచ్చని రంగులో నోరూరిస్తుంటే.. జనం ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఆ పండ్లు సహజ సిద్ధంగా పక్వానికి వచ్చినవా.. లేక రసాయనాలతో మగ్గబెట్టినవా అని పట్టించుకోకుండా కడుపారా తిని రోగాల పాలవుతున్నారు. సాధారణంగా పక్వానికి వచ్చిన మామిడి కాయలను వరి గడ్డిలో అవి పండేంత వరకు మగ్గబెట్టాలి.

 

 ఇలా చేస్తే అవి కావాల్సినంత రుచి, వాసనను ఇస్తాయి. అయితే కొందరు వ్యాపారులు చెట్టు మీద కాయలు పక్వానికి రాకముందే కోసి మగ్గబెడుతున్నారు. తొందరగా పండడం కోసం కాల్షియం కార్బైడ్, పొగబెట్టి మాగ బెట్టడం ద్వారా పండ్లుగా మారుస్తున్నారు. అనంతరం బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పండిన పండ్లలో ప్రక్టోజ్, గ్లూకోజ్, కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. శరీరం నీరసించినప్పుడు ఇవి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మలబద్ధకం, ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడతాయి. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లలో ఇవి ఉండవు. పైగా ఆరోగ్యానికి హానికరం.  

 

 ఆరోగ్యంపై ప్రభావం

 కార్బైడ్, ఇతర రసాయనాలతో మగ్గించిన మామిడి పండ్లను తింటే జీర్ణావస్థలో తీవ్ర సమస్యలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ పండ్లను తింటే గర్భిణుల్లో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నరాల బలహీనత, రక్తహీనత వంటి సమస్యలు తోడవుతాయి. పిల్లలయితే డయేరియా, శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లను తింటే గ్యాస్‌ట్రబుల్, జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. ఊపిరి తిత్తులపై ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థ, జన్యు సంబంధ వ్యాధులు వస్తాయి. వాంతులు, విరేచనాలు కలిగే అవకాశం ఉంటుంది. మామిడి పండుకు పైన తొక్క ఉంటుంది. రసాయనాలతో మాగబెట్టేటప్పుడు ఈ తొక్కపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందులో రసాయనాలు అధికంగా ఉంటాయి. పండ్లను ఉప్పు నీటితో కడిగి.. పైన తొక్కను తీసేసి తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. కాస్త వగరున్నా, సంప్రదాయ రీతిలో మాగబెట్టిన పళ్ల తొక్కను తింటేనే మంచిది.

 

 ఎలా మాగబెడతారంటే..

 మామిడి పండ్లను కొనుగోలు చేయడం వ్యాపారులకు ఆర్థికంగా పెట్టుబడి ఎక్కువ కావడంతో కాయలను ఎంచుకుంటున్నారు. మామిడి తోటల్లో కాయలు, గాలి దుమారానికి కింద పడిన కాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తారు. గ్యాస్ వెల్డింగ్‌కు వినియోగించే కాల్షియం కార్బైడ్‌ను కొని పొట్లాలుగా తయారు చేసుకుంటారు. 20 కిలోల మామిడి కాయల బాక్స్‌లలో.. నేలపై రాశులుగా వేసిన కాయల మధ్య ఐదు నుంచి 50 వరకు పొట్లాలను పెడతారు. ఈ కార్బైడ్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. ఆ రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రత పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి. ఇలా తయారైన పండ్లను మార్కెట్‌లో రిటైల్ అమ్మకం దారులుకు విక్రయిస్తారు.  

   

 అమలు కాని నిషేధం

 బహిరంగ మార్కెట్‌లో కార్బైడ్ విచ్చలవిడిగా లభిస్తోంది. కిలో రూ.80 వరకు ఉంటోంది. దీనిని స్టీలు రంగు మార్చేందుకు, వెల్డింగ్ కోసం ఉపయోగిస్తారు. పండ్లపై వీటి వాడకాన్ని నిషేధించినా అమలు కావడం లేదు. వ్యాపారులు గోదాముల్లో కార్బైడ్‌ను వినియోగించి మాగబెడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లిప్తతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు.    

 

 ధర తక్కువని కొంటే..

 అనంతపురంలోని రైతు బజార్‌లో సంప్రదాయ పద్ధతిలో మాగించిన పళ్లను కిలో రూ.40 చొప్పున విక్రయిస్తుంటే.. రోడ్లమీద 3 కిలోలు రూ.100 చొప్పున అమ్ముతున్నారు. దీంతో చాలా మంది ధర తక్కువ అనే కారణంతో రోడ్ల మీద కొనుగోలుకే ఆసక్తి చూపిస్తూ.. అవి తిని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు.

 

 జాగ్రత్తలు తీసుకోకుంటే సమస్యలే

 అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : త్వరితగతిన కృత్రిమ పద్ధతిలో మాగిం చిన మామిడి పళ్లను తినడం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంద ని అనంతపురం ప్రభుత్వ వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌ై ఎం.బాబు తెలి పారు. వేసవిలో సంప్రదాయ పద్ధతిలో మాగించిన మామిడి పండ్లను తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉందన్నారు. ‘రసాయనాలతో మగ్గబెట్టినవి తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. రసాయనాలతో మామిడి పండ్లను మాగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

 

 గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువ మోతాదులో తింటే డీ హైడ్రేషన్ ఏర్పడి మనిషి తనలోని శక్తిని కోల్పోయి నీరసించే మ్రాదం ఉంది. సహజ సిద్ధంగా పండించిన మామిడి పండ్ల వల్ల ఎలాంటి హాని ఉండదు’ అని ‘న్యూస్‌లైన్’కు వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top