
బావి వద్ద గుమికూడిన జనాలు (ఇన్‌సెట్‌లో) మృతి చెందిన వన్నూరుస్వామి
బత్తలపల్లి : రోడ్డుపక్కనున్న బావిలో ఈతకొట్టేందుకు పైనుంచి దూకిన టైల్స్‌వర్కర్ కడుపుభాగంలో బలమైన దెబ్బతగిలి నీటమునిగి మృతిచెందాడు. ఈదులముష్టూరులో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులతోపాటు ఎస్‌ఐ హారున్‌బాషా తెలిపిన మేరకు.. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డుకు చెందిన టైల్స్‌వర్కర్ బలిజ వన్నూరుస్వామి (25) తన స్నేహితులు రాము, అనిల్, శేఖర్‌తో కలిసి బంధువుల గృహప్రవేశం కోసం శుక్రవారం ఆటోలో ధర్మవరం వచ్చారు. అక్కడ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగుపయనమయ్యారు. బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు సమీపంలోని వ్యవసాయ బావి వద్ద కొందరు చిన్నారులు ఈత కొడుతుండడం గమనించారు.
ఎండలకు ఉక్కపోతగా ఉండటంతో ఆటోను పక్కన ఆపి ఈతకొట్టేందుకు వెళ్లారు. బావిలో నీరు బాగా ఉండటంతో వన్నూరుస్వామి రెండుసార్లు పై భాగం నుంచి నీళ్లలోకి దూకాడు. మూడోసారి నీటిలోకి దూకినపుడు కడుపుభాగంలో దెబ్బతగిలింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికులు నీటి అడుగుభాగంలో గాలించి అతడిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఊపిరాడక వన్నూరుస్వామి మృతిచెందాడు. తహసీల్దార్ సురేష్‌బాబు, ఎస్‌ఐ హారున్‌బాషా తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి సమాచారం సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.