ఘోషాఆస్పత్రిలో అపహరణకు గురైన మగశిశువు ఆచూకీ దొరుకుతుందా? లేదా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన జరిగి 20 రోజులవుతున్నా
సంఘటన జరిగి 20 రోజులవుతున్నా లభ్యంకాని ఆచూకీ
తల్లిదండ్రులను ఇంటికి పంపించేసిన ఆస్పత్రి అధికారులు
విజయనగరంఆరోగ్యం: ఘోషాఆస్పత్రిలో అపహరణకు గురైన మగశిశువు ఆచూకీ దొరుకుతుందా? లేదా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన జరిగి 20 రోజులవుతున్నా ఎటువంటి పురోగతీ లేకపోవడమే ఊహాగానాలకు తావిస్తోంది. ఘోషాఆస్పత్రిలో ఈనెల 10వతేదీన ఎస్.కోట మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన జన్నిగంగితల్లి, ఎర్రిబాబు దంపతులకు జన్మించిన మగశిశువును ఓ మాయలేడి ఎత్తుకెళ్లింది. రోజులు గడుస్తున్నా, శిశువు అచూకీ ఇంతవరకు కానరాలేదు. అసలు శిశువును ఎత్తుకెళ్లిన మాయలేడి జిల్లాకు చెందిన మహిళా? లేదా ఇతర జిల్లాలకు చెందిన మహిళా? అనేది అంతుచిక్కని ప్రశ్న. 20 రోజులుగా శిశువు తల్లిదండ్రులు తమ బిడ్డ దొరుకుతుందనే గంపెడాశతో ఘోషాఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే శిశువు ఆచూకీ ఎప్పటికీ దొరకకపోవడంతో ఆస్పత్రి వైద్యులు గంగితల్లిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. శిశువు దొరికితే సమాచారం అందిస్తామని ఘోషాఆస్పత్రి అధికారులు ఆమెకు చెప్పారు. శిశువు లేకుండా ఇంటికి ఏవిధంగా వెళ్లాలో తెలియని గంగితల్లి చేసేది లేక ఇంటికి చేరింది.
కేసును ఛేదిస్తారా? చేతులెత్తేస్తారా?
జిల్లాలో సంచలనం సృష్టించిన మగశిశువు అపహరణ కేసును పోలీసులు ఛేదిస్తారా, లేదంటే చేతులెత్తేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శిశువు అపహరణకు గురైన తొలిరోజున శిశువు ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. అయితే 20 రోజులుగా పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా దర్యాప్తుచేస్తున్నారు. ఘోషాఆస్పత్రికి ప్రతిరోజూ పోలీసులు వచ్చి విచారణ చేస్తున్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఏ విషయాన్నీ తేల్చలేకపోయారు.