breaking news
Hospital officials
-
‘జూ’జీహెచ్!
పనిచేయని ఏసీల్లో ఎలుకలు.. మూలల్లో.. కలుగుల్లో పాములు.. ఇవన్నీ ఏ ‘జూ’లోనో కాదు. సాక్షాత్తూ మన పెద్దాసుపత్రిలో..! వీటికంటే ప్రమాదకరంగా నిర్లక్ష్యం కూడా ఇక్కడ వేళ్లూనుకుని ఉంది. మూషికాల దాడిలో పసికందు మృత్యుఒడి చేరినా.. సర్పాల భయంతో విధులు చేయలేమని సిబ్బంది మొత్తుకుంటున్నా.. అధికారులు, ప్రభుత్వం తీరు మాత్రం మారదు. ఈ వరుస దురదృష్టకర ఘటనలు అందరినీ కలచి వేస్తున్నా వీరి మనసు మాత్రం కరగదు. - గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మొన్న ఎలుక కాటు.. నిన్న పాముల సంచారం - తాజాగా రోగి చేతివేలును కరిచిన ఎలుక - రోగుల ఆరోగ్య భద్రతపై నీలినీడలు సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మూషికాల దాడిలో పసికందు మృతి చెందిన ఘటనతోనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఆసుపత్రి అధికారుల్లో కనువిప్పు కలుగుతుందేమోనని అంతా భావించారు. ఘటన జరిగిన వారం రోజులు వారంతా హడావుడి చేసి వదిలేశారు. శుక్రవారం రేడియాలజీ విభాగం 105వ నంబర్ గదిలో రక్తపింజరు పాము గమనించిన రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది మరువక ముందే శుక్రవారం రాత్రి ఆర్థోపెడిక్ విభాగంలో చెయ్యి విరిగి ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్న రాయపాటి యేసమ్మ చేతి వేలును ఎలుక కొరకడం తీవ్ర కలకలం రేపింది. ఇంత జరిగితే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం ఎలుక కరవలేదని రోగుల చేత చెప్పించే ప్రయత్నాలు చేయడం దారుణ ం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. జీజీహెచ్‌లో రోగుల భద్రతపై రోజురోజుకూ నీలినీడలు కమ్ముకుంటూనే ఉన్నాయి. వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో.. రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల నుంచి రక్షణ కల్పించలేక 15 రోజులుగా సర్జికల్ ఆపరేషన్ థియేటర్ (ఎస్ఓటీ) మూతపడినా, పిల్లల శస్త్ర చికిత్సా విభాగంలో చేరేందుకు రోగులు విముఖత చూపుతున్నా.. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూరోసర్జరీ విభాగంలో ఆపరేషన్ కోసం ఎదురుచూస్తూ పదిహేను రోజులుగా ముగ్గురు రోగులు మంచాలపై మూలుగుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి.. మూషికాల దాడిలో శిశువు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. మరోవైపు జీజీహెచ్ ప్రతిష్టను దిగార్చింది. నలుగురు మంత్రులు, ఉన్నతాధికారులు జీజీహెచ్‌లో హడావిడి చేసి తూతూమంత్రంగా మృత శిశువు తల్లిదండ్రులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. జీజీహెచ్‌లోని అధికారులు, వైద్యులు, నర్సులపై చర్యలు తీసుకుంటున్నట్లు సాక్షాత్తు వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. నెలరోజులు కావస్తున్నా ఇంతవరకూ ఉత్తర్వులు మాత్రం వారికి అందలేదు. పాములు, ఎలుకలు ఆసుపత్రిలో సంచరిస్తున్నా వాటిని నివారించి తప్పుదిద్దుకోవాల్సిన ఆసుపత్రి అధికారులు మాత్రం రోగులను బెదిరించి ఎలుకలు కరవలేదని బొంకే ప్రయత్నాలు చేయడం క్షమించరాని విషయమని వైద్యులు, సిబ్బందే మండిపడుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి జీజీహెచ్‌ని ప్రక్షాళన చేసి పెద్దాసుపత్రిని రక్షించాలని పలువురు కోరుతున్నారు. -
ఎక్కడున్నావు బిడ్డా..!
సంఘటన జరిగి 20 రోజులవుతున్నా లభ్యంకాని ఆచూకీ తల్లిదండ్రులను ఇంటికి పంపించేసిన ఆస్పత్రి అధికారులు విజయనగరంఆరోగ్యం: ఘోషాఆస్పత్రిలో అపహరణకు గురైన మగశిశువు ఆచూకీ దొరుకుతుందా? లేదా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన జరిగి 20 రోజులవుతున్నా ఎటువంటి పురోగతీ లేకపోవడమే ఊహాగానాలకు తావిస్తోంది. ఘోషాఆస్పత్రిలో ఈనెల 10వతేదీన ఎస్.కోట మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన జన్నిగంగితల్లి, ఎర్రిబాబు దంపతులకు జన్మించిన మగశిశువును ఓ మాయలేడి ఎత్తుకెళ్లింది. రోజులు గడుస్తున్నా, శిశువు అచూకీ ఇంతవరకు కానరాలేదు. అసలు శిశువును ఎత్తుకెళ్లిన మాయలేడి జిల్లాకు చెందిన మహిళా? లేదా ఇతర జిల్లాలకు చెందిన మహిళా? అనేది అంతుచిక్కని ప్రశ్న. 20 రోజులుగా శిశువు తల్లిదండ్రులు తమ బిడ్డ దొరుకుతుందనే గంపెడాశతో ఘోషాఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే శిశువు ఆచూకీ ఎప్పటికీ దొరకకపోవడంతో ఆస్పత్రి వైద్యులు గంగితల్లిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. శిశువు దొరికితే సమాచారం అందిస్తామని ఘోషాఆస్పత్రి అధికారులు ఆమెకు చెప్పారు. శిశువు లేకుండా ఇంటికి ఏవిధంగా వెళ్లాలో తెలియని గంగితల్లి చేసేది లేక ఇంటికి చేరింది. కేసును ఛేదిస్తారా? చేతులెత్తేస్తారా? జిల్లాలో సంచలనం సృష్టించిన మగశిశువు అపహరణ కేసును పోలీసులు ఛేదిస్తారా, లేదంటే చేతులెత్తేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శిశువు అపహరణకు గురైన తొలిరోజున శిశువు ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. అయితే 20 రోజులుగా పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా దర్యాప్తుచేస్తున్నారు. ఘోషాఆస్పత్రికి ప్రతిరోజూ పోలీసులు వచ్చి విచారణ చేస్తున్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఏ విషయాన్నీ తేల్చలేకపోయారు. -
అంధకారంలో గైనిక్, చిన్న పిల్లల వార్డు
అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వజనాస్పత్రిలోని గైనిక్, చిన్నపిల్లల వార్డు, బ్లడ్ బ్యాంక్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 10.30 గంటలకు పునరుద్ధరించారు. ప్యానల్ బోర్డులోని కేబుల్ కాలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. దీన్ని మార్చడానికి రూ.50 వేలు ఖర్చవుతుందని వారు పేర్కొంటున్నారు. దీన్ని గుర్తించడానికే సిబ్బందికి చాలా సమయం పట్టిందని రోగులు వాపోతున్నారు. వార్డుల్లో పది గంటలపాటు కరెంటు లేకపోవడంతో రోగులు, సహాయకులు చీకట్లోనే రాత్రి భోజనాలు చేశారు. ఫ్యాన్లు తిరగకపోవడంతో గాలి లేక పిల్లలు అల్లాడిపోతున్నారు. నెబులైజేషన్ పూర్తి స్థాయిలో అందకపోవడంతో పిల్లలు ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. బ్లడ్బ్యాంక్లోని రక్తం చెడిపోతుందేమోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.