మహిళ మొక్కవోని దీక్ష

Mamidipalli Women Get SI Post Third Place in Visakhapatnam - Sakshi

మామిడిపల్లికి చెందిన పద్మావతిని వరించిన ఎస్‌ఐ పోస్టు

రాష్ట్ర స్థాయి మహిళా విభాగం ఓపెన్‌ కేటగిరీలో 15 స్థానం

విశాఖ జిల్లా స్థాయిలో మూడో స్థానం

విశాఖపట్నం  ,దేవరాపల్లి: దేవరాపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబానికి చెందిన నాళం పద్మావతి అలియాస్‌ పూడి పద్మావతి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆప్‌ పోలీస్‌(ఎస్‌ఐ) పోస్టుకు అర్హత సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెలువరించిన ఫలితాల్లో పద్మావతిని ఎస్‌ఐ పోస్టు వరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందితో పోటీపడ్డ పద్మావతి విశేష ప్రతిభ కనబరిచి ఎస్‌ఐ పోస్టును దక్కించుకని తన కలలను సాకారం చేసుకున్నారు.  పద్మావతికి వివాహమైనప్పటికీ తన భర్త సహకారంతో రెండున్నరేళ్లలో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. మామిడిపల్లికి చెందిన పద్మావతికి అదే గ్రామానికి చెందిన పూడి దేముడినాయుడుతో వివాహం జరిగింది.  ఇండియన్‌ నేవి, ఎయిర్స్‌ఫోర్స్‌ లేదా సివిల్, ఎస్‌ఐ ఉద్యోగాలలో ఏదో ఒక దానిని సాధించాలన్న తపనను తన భర్త దేముడునాయుడుకు తెలియజేయగా ఎస్‌ఐ పోస్టుకు కోచింగ్‌ తీసుకోవాలన్న భర్త సూచన మేరకు 2016లో రాజమండ్రిలో ఒక ఇనిస్టిట్యూట్‌లో  చేరారు.

కుటుంబ సభ్యులతో పద్మావతి
తొలి ప్రయత్నంలో కేవలం 8 మార్కుల తేడాలో త్రుటిలో విజయం చేజారిపోయింది.  ఎక్కడా నిరాశకు గురి కాకుండా మొక్కవోని దీక్షతో కఠోర సాధన చేసింది. 2017లో విశాఖలోని షైన్‌ ఇండియా కోచింగ్‌ సెంటర్‌లో చేరి శిక్షణ పొందుతున్న క్రమంలో 2018లో ఎస్‌ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ధరఖాస్తు చేశారు. డిసెంబర్‌లో జరిగిన ప్రిలిమ్స్‌ పరీక్షలో ఉత్తీర్ణ సాధించిన పద్మావతి ఆ తర్వాత జనవరిలో జరిగిన ఈవెంట్స్‌లో కూడా పాసై పిభ్రవరి 20న జరిగిన మెయిన్స్‌ పరీక్షకు  హాజరయ్యారు.  వీటి ఫలితాలు సోమవారం విడుదల కాగా పద్మావతి 211మార్కులు సాధించి రాష్ట్రంలో ఓపెన్‌ కేటగిరిలో 625వ ర్యాంక్‌ సాధించారు. అలాగే రాష్ట్ర స్థాయి మహిళా విభాగం ఓపెన్‌ కేటగిరీలో 15 స్థానంను, బీసీ–డి మహిళా విభాగంలో జిల్లా ప్రధమ స్థానంలోను, విశాఖ జిల్లా స్థాయిలో మూడవ స్థానంను సొంతం చేసుకోని నేటి నిరుద్యోగ యువతకు దిక్సూచిగా పద్మావతి నిలిచింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top