బాబు పాలనలో 'కూలి'న బతుకులు

Majority of suicides Held in 2016 were Daily Laborers Says NCRB - Sakshi

2016లో జరిగిన ఆత్మహత్యల్లో అత్యధికులు కూలీలే 

1,333 మంది రోజువారీ కూలీల బలవన్మరణం 

జాతీయ నేర గణాంక సంస్థ నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: రెక్కాడితే గాని డొక్కాడని వారి బతుకులు చంద్రబాబు హయాంలో ‘కూలి’పోయాయి. ఆయన జమానాలో జరిగిన ఆత్మహత్యల్లో అత్యధికులు రోజువారీ కూలీలేనని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదికలో వెల్లడైంది. 2016లో జరిగిన ప్రమాద మరణాలు–ఆత్మహత్యలకు సంబంధించి ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన నివేదిక అనేక చేదు సత్యాల్ని బయటపెట్టింది. 2016లో రాష్ట్రంలో 6,059 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో రోజువారీ కూలీలు 1,333 మంది ఉన్నారు. ఇక నేల తల్లిని నమ్ముకున్న రైతులు, రైతు కూలీలు అప్పుల పాలవడంతో బతికే దారి లేక, ప్రభుత్వం ఆదుకోకపోవడంతో 804 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగం ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. సాగు పెట్టుబడులు పెరగడం, పంట నష్టాలు, గిట్టుబాటు ధర దక్కకపోవడం, అప్పుల బాధలు, పనులు లేకపోవడం వంటి కారణాలతో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి మరణాల్లో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఆరో స్థానంలో ఉండగా మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. అన్ని రంగాల్లో ఆత్మహత్యలను పరిశీలిస్తే దేశంలో ఏపీ తొమ్మిదో స్థానంలో ఉంది.   

2016 గణాంకాల ప్రకారం.. 
- 2016లో దేశవ్యాప్తంగా మొత్తం 1,31,008 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో 6,059 మంది(4.6 శాతం) ఏపీకి  చెందినవారు.  
- దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి చెందిన 11,379 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో ఏపీకి చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు 804 మంది ఉన్నారు. వారిలో పురుషులు 730 మంది కాగా, మహిళలు 74 మంది ఉన్నారు.  
- ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు 239 మంది కాగా వారిలో భూమి కలిగిన వారు 115 మంది, కౌలుకు చేస్తున్నవారు 124 మంది. వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలు 565 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంలోని ఆత్మహత్యల్లో ఏకంగా 70 శాతానికి పైగా కూలీలే కావడం గమనార్హం.  

ప్రమాద మరణాలు
2016లో రాష్ట్రంలో 25,050 ప్రమాదాలు నమోదయ్యాయి. 30,052 మంది క్షతగాత్రులు కాగా 9,937 మంది మృతి చెందారు. వీటిలో రోడ్డు ప్రమాదాలు 23,658 కాగా.. రైలు నుంచి జారిపడటం, ప్రమాదవశాత్తు రైలు కింద పడటం వంటివి 1203, రైల్వే లైన్‌ క్రాస్‌ చేస్తుండగా 189 ఘటనలు జరిగాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top